త్వరలో కొత్త పార్టీతో వస్తున్నా.. కోదండరాం - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో కొత్త పార్టీతో వస్తున్నా.. కోదండరాం

February 5, 2018

‘ ఆస్తుల కోసమో.. కమీషన్ల కోసమో రాజకీయ అరంగేట్రం చేయడం లేదు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నేటికీ నెరవేరలేదు. ఐకాస ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేశాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అందుకే ప్రత్యక్ష రాజకీయాలు వస్తున్నాను ’ అని తెలిపారు తెఐకాస ఛైర్మన్‌ కోదండరాం.తెలంగాణ రాష్ట్రంలో పక్కా వ్యూహంతో కొత్త పార్టీ పెడుతున్నట్టు తైఐకాస ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. ప్రభుత్వ ఆగడాలను అడ్డుకట్ట వేయటానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు తెలిపారు. పార్టీ పేరు, విధి విధానాలనూ త్వరలో ప్రకటిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని ఓ కల్యాణ మండపంలో జరిగిన ‘ రైతాంగ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ’లో కోదండరాం ఈ ప్రకటన చేశారు. వివిధ జిల్లాల ఐకాస ప్రతినిధులు, రైతులు హాజరైన సదస్సుకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడారు.

కొత్త పార్టీ ఏర్పడినా రాష్ట్రంలో ఐకాస కొనసాగుతుంది.. ఐకాస ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమాలు కొనసాగడమే కాదు సమాంతర రాజకీయాల్లో కొనసాగుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 3432 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం 798 మంది ఆత్మహత్య చేసుకున్నారనడం అత్యంత బాధాకరం. ఐకాస ప్రతినిధులు 31 జిల్లాల్లో పర్యటించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలపై నివేదికను సిద్ధం చేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కాగా ప్రజా గాయకుడు గద్దర్ కూడా ఐకాస వెంట వుంటానన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని, చిన్నకారు, సన్నకారు రైతులకు అండగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశ పెట్టాలనే తీర్మానాలకు సదస్సు  ఆమోదం తెలిపింది.