కంప్యూటర్ బాబా కథా కమామిషు..! - MicTv.in - Telugu News
mictv telugu

కంప్యూటర్ బాబా కథా కమామిషు..!

April 12, 2018

ఇహాన్ని వదిలేసి పరమే పరమావధిగా జీవితాన్ని ముక్తికై భక్తి మార్గంలో వెళ్ళదీస్తారు సాధువులు. అలాంటి సాధువులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంత్రి హోదాలను కట్టబెట్టడం హాస్యాస్పదం అని అనేక విమర్శలు వినబడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం ఈ వివాదస్పద నిర్ణయం తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కంప్యూటర్‌ బాబా సహా ఐదుగురు నర్మదా బాబాలకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ శివరాజ్‌సింగ్‌ సర్కార్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.నర్మదా నది సంరక్షణకు ఏర్పాటైన జన్‌ జాగృక్త అభియాన్‌ సమితిలో మార్చి 31న ఐదుగురు బాబాలు నియమితులయ్యారు. మత గురువులైన నర్మదానంద్‌ మహరాజ్‌, కంప్యూటర్‌ బాబా, హరిహరానంద్‌ మహరాజ్‌, భయ్యూ మహరాజ్‌, పండిత్‌ యోగేంద్ర మహంత్‌లకు మంత్రి హోదా ప్రకటించిన విషయం తెలిసిందే. సమితి సభ్యులుగా వారంతా తమ పనులను మరింత సులువుగా చేపట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

తనకు మంత్రి హోదా దక్కడంపై కంప్యూటర్ బాబా స్పందిస్తూ… ‘ మాపై నమ్మకం ఉంచినందుకు సాధువుల సమాజం తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సమాజ శ్రేయోభివృద్ధి కోసం మా శాయశక్తులా కృషి చేస్తాం ’ అని పేర్కొన్నారు.

కంప్యూటర్ బాబా ప్రభుత్వం తనకు కేటాయించిన ప్రభుత్వ భవనంపై నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు. తల మీద కలశం పెట్టుకొని చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని పూజలు చేయటం విశేషం. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఇలా కంప్యూటర్ బాబా పూజలు చేస్తున్నారు. చుట్టూ పొగ పెట్టుకొని పెద్దగా అరుస్తూ మంత్రాలు చదువుతూ, ఆయన నిత్యం ప్రభుత్వ భవనంపై ఇలా పూజలు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈయన అసలు పేరు  స్వామి నాందేవ్ త్యాగి. కాల క్రమంలో కంప్యూటర్ బాబాగా గుర్తింపు పొందారు. ఈయన మెదడు చాలా చురుగ్గా కంప్యూటర్‌లా పని చేస్తుందని చాలా మంది ఈయనను కంప్యూటర్ బాబా అని పిలవటం మొదలు పెట్టారు.

నిత్యం మొబైల్ ఫోన్లు, వైఫై పరికరాలతో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ల్యాప్‌టాప్ లేకుండా ఎక్కడికీ వెళ్లరు.ఇండోర్‌లో జన్మించారు. 2015లో వచ్చిన ‘ పీకే ’ సినిమాను వ్యతిరేకించి అప్పట్లో వార్తల్లో నిలిచారు.