శ్రీదేవి మృతితో  కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమంది! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి మృతితో  కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమంది!

February 26, 2018

మూలిగే నక్కమీద తాటి కాయ పడడం అంటే ఇదేనేమో. లేక లేక ఎన్నోరోజులనుండి కసరత్తులు చేసి, కమిటీలు వేసి.. ‘ప్రజా చైతన్య యాత్ర’ పేరుతో స్పెషల్ బస్సును తయారు చేపించి, యాత్ర విజయవంతం కావాలని పోస్టర్లు కొట్టించి, కళాకారులచేత పాటలు పాడించి,సీడీలను విడుదల చేసి మరీ.. అందరిని దృష్టిని ఆకర్షించాలని ఎంతో ఆత్రుత పడిన కాంగ్రెస్ ఆశలపై శ్రీదేవి మృతి నీళ్లు చల్లిందనే చెప్పాలి.  

శ్రీదేవి మరణంతో  మీడియా కనీస మర్యాదగా కూడా కాంగ్రెస్ బస్సు యాత్రవైపు చూడడంలేదు. ఎంతో అట్టహాసంగా కాంగ్రెస్ మొదలు పెట్టిన  చైతన్యయాత్రపై  ఒక్క వార్త కూడా మచ్చుకైనా లేకపోవడంతో  కాంగ్రెస్ కార్యకర్తల మొఖాలు పాలిపోయాయి. అయినా సరే మీడియా ప్రచారం చేసినా, చేయకపోయినా కూడా మాయాత్ర ఆపేది లేదు అంటూ ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ నేతలు.

టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో …టీఆర్ఎస్ అధికారాన్ని ఎండగడుతూ  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా  మొదలైనదే ఈ ప్రజాచైతన్య బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి అధికారంలోకి రావాలని  కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. ఈరోజు నుండి మార్చి 12 వరకు ఈ యాత్ర  మొదటి దశ ఉంటుంది. 12 రోజుల పాటు నిర్వహించే యాత్రలో 24 నియోజక వర్గాల్లో పర్యటిస్తారు. తొలిదశలో రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో యాత్ర జరగనుంది. సెంటిమెంట్ గా  మొదట ఈ యాత్ర చేవేళ్ల నుంచి ప్రారంభమయ్యింది.