కోమటిరెడ్డి, సంపత్ నిరాహారదీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

కోమటిరెడ్డి, సంపత్ నిరాహారదీక్ష

March 13, 2018

తెలంగాణ  ప్రభుత్వం తమపై తీసుకున్న చర్యల పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కనీసం తమ నుంచి వివరణ తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్స్ విసిరిన సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లు నిరసన చేపట్టనున్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించనుంది. బుధవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కాంగ్రెస్ నేతలు పిటిషన్ వేయనున్నారు. ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చలు జరిపిన నేతలు రేపు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా 48 గంటల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహారదీక్ష  చేపట్టనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు తమ దీక్షను ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన కాంగ్రెస్ నేతలు జానారెడ్డి సమక్షంలో సమావేశమయ్యారు.  తాను సభలో శాంతియుతంగా ఉంటే ఏ విధంగా తనపై చర్యలు తీసుకుంటారని జానారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామిక చర్య అని, స్వామిగౌడ్‌పై దాడి దృశ్యాలను మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదంటూ ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ప్రశ్నించారు.