mictv telugu

రాజమౌళి RRR కు పోటీగా.. కేసీఆర్ RRR

February 11, 2019

కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. కేసీఆర్ రీజనల్ రింగ్ రోడ్ పై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి వచ్చే కలెక్షన్లను అధిగమించే విధంగా కేసీఆర్ గారు కొత్త ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ గారి ‘ఆర్ఆర్ఆర్’ ఏమిటంటే రీజనల్ రింగ్ రోడ్” అని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఆపై “ఈ ‘ఆర్ఆర్ఆర్’కు, తెలంగాణ కేబినెట్ విస్తరణలో జరుగుతోన్న ఆలస్యానికి ఒక లింక్ ఉందని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరాలంటే కొంత రిస్క్ చేయక తప్పదని తెలుస్తోంది” అన్నారు.
“కేసీఆర్ గారి కేబినెట్ లో చేరబోయే వారికి విధించబోయే షరతులు ఏమిటంటే… టిఆర్ఎస్ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో చేయబోతున్న లక్ష కోట్ల కుంభకోణానికి, మంత్రులు ఆమోదముద్ర వేయడంతో పాటు దానికి పూర్తి భాద్యత వహించాలి. రేపు ఏమైనా చట్టపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులే భరించాలి”అని, “దీనికి సిద్ధపడిన వాళ్లు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చెయ్యాలని కేసీఆర్ గారు మెలిక పెట్టారట. ఈ షరతులకు అంగీకరించని హరీశ్ రావు లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.” అని వరుస ట్వీట్లు చేశారు. “కేసీఆర్ గారి కేబినెట్లో మంత్రులను రబ్బర్ స్టాంప్ లా వాడుకుంటారని తెలుసు కానీ… ప్రభుత్వం చేసే అవినీతికి ఏజెంట్లుగా మార్చాలనుకోవడం దారుణం” అని మరో వ్యాఖ్య చేశారు.