టికెట్ల కొట్లాటతో గాంధీభవన్‌కు ఎన్నికల కళ - MicTv.in - Telugu News
mictv telugu

టికెట్ల కొట్లాటతో గాంధీభవన్‌కు ఎన్నికల కళ

February 1, 2018

ఆలూ లేదు,చూలూ లేదు కొడుకు పేరు ఏదో అన్నట్లే ఉంది, కాంగ్రెస్ పార్టీలో కొందరి నేతల తీరు చూస్తుంటే. 2019లో ఎన్నికలు ఉంటే  గాంధీభవన్ కు అప్పుడే ఎన్నికల కళ వచ్చింది. టికెట్ల కొట్లాటతో షురువైన ఈకళ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే దాకా వెళుతుంది. ఓట్ల పండుగ రాకముందే సీట్ల పంచాయితీ షుర్వైంది. 2019లో వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే టికెట్ల మీద చంకలు గుద్దుకోవడాలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు చేస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి మరోనేత  క్యామ మల్లేష్‌పై విరుచుకు పడ్డారు. క్యామ మల్లేష్  తనకు ఇబ్రహీంపట్నం టికెట్ వచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. దీనిపై మల్‌రెడ్డి మాట్లాడుతూ ‘ గత ఎన్నికల్లో ఓడిపోయేవారికి టిక్కెట్లు ఇవ్వడం వల్లే..కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఓడిపోయింది. రంగారెడ్డి జిల్లా పీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఇబ్రహీంపట్నం టిక్కెట్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెంది గాంధీ భవన్‌కు వచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి దూరం కావడానికి ఇలాంటి వాళ్లే కారణం.

గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు, మల్లేష్ మాత్రం టిక్కెట్ వచిన్నట్టుగా అబద్దపు ప్రచారం చేస్తున్నారు. గెలిచే వారికి టిక్కెట్ ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌ కుంతియాను కలిసి చెప్పాం. క్యామ మల్లేష్‌కు ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇవ్వడం వల్ల భువనగిరి పార్లమెంటు సీటు ఓడిపోయామని, తమకే గనక ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇచ్చి ఉంటే..భువనగిరి  పార్లమెంటు గెలిచే వాళ్లం.  క్యామమల్లేశ్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని బదనాం చేస్తున్నాడు’ అని మల్ రెడ్డి  మండిపడ్డారు.