పోటాపోటీ… పీక్ లెవల్లో మైండ్ గేమ్.. - MicTv.in - Telugu News
mictv telugu

పోటాపోటీ… పీక్ లెవల్లో మైండ్ గేమ్..

December 6, 2018

పోలింగ్ రెండు రోజుల ముందు నుండి మైండ్‌గేమ్ మొదలైంది. ప్రచారం చివరి రోజున  అది పీక్ స్టేజీకి వెళ్లింది. మునుపెన్నడూ లేని రీతిలో పార్టీలు ప్రచారాలు చేసుకున్నాయి. సర్వేలు చేసుకున్నాయి. గట్టి అభ్యర్థులను ఏరి కోరి బరిలోకి దించాయి. ఎవరి సర్వేలు వారివి. ఎవరి అంచనాలు వారివి. తాము గెలుస్తామని చెప్పుకునే దానికంటే  ఇతరులు తక్కువ సీట్లు, ఓట్లు వస్తాయనే విషయాన్నే ఎక్కువ ప్రచారం చేశాయి పార్టీలు.

మైండ్‌గేమ్‌ను పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లింది లగడపాటి రాజగోపాల్. ఆయన సర్వే గురించి  తొలుత తిరుపతిలో చెప్పారు. వారంరోజుల ముందు గేమ్ స్టార్ట్ చేశారు. దాన్ని మెల్లమెల్లగా పోలింగ్  దాకా తీసుకొచ్చారు. ప్రచారానికి ముందు రోజు సర్వే గురించి చెప్పారు. దానికి ఎన్నో స్టోరీలు అల్లారు.  దానికంటే ముందే రాజగోపాల్ పేరుతో చాలా సర్వేలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

వాటికి సమాధానం  చెప్తానంటూ ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఈ లోపుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కారు పార్టీ ఇలా తమతమ సర్వేల గురించి సభల్లో చెప్పుకున్నారు.  కూటమికి పెద్దగా సీట్లు వచ్చేది లేదని చెప్పారు. తామే ముందంజలో ఉన్నామని అన్నారు.Telugu news Contest ... Mind game in peak levels ..టికెట్ల పంపిణీ నుండి కాంగ్రెస్ పార్టీ సర్వేల గురించి మాట్లాడుతున్నది. ప్రచారం చేసుకుంటున్నట్లుగా  సీట్లు రావని చెప్పింది. మిత్రులకు సీట్ల పంపిణీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడింది.  అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేయడం వెనుకా మైండ్ గేమ్ ఉన్నట్లుందని అప్పట్లోనే చాలా మంది అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు సీన్‌లోకి వచ్చి రాహుల్‌తో కలిసి సభలు పెట్టేంత వరకు వారి  మైండ్ ఎలా ఉంటుందో అర్థం కాలేదని మరి కొందరు అంటారు.

ఆ తర్వాత సర్వేల గురించిన చర్చ కూటమిలో పెద్ద ఎత్తున జరిగింది. సీట్ల పంపిణీ విషయంలో ఇక్కడ కాదు అమరావతిలో  కాదు హస్తినకు వెళ్దామంటూ అక్కడికీ వెళ్లారు. అక్కడా తేల్చకుండా నాన్చారు. సర్వేల్లో గెలుస్తారని తేలిన వారికి మాత్రమే  టికెట్లు ఇస్తామన్నారు. ఏదో చేస్తున్నట్లు ఏమీ చేయనట్లే… ఇలా మైండ్‌గేమ్ ఆడారు.

కారు పార్టీ రెండు మూడు సార్లు అభ్యర్థులతో భేటీ అయింది. ఆయా నియోజకవర్గాల్లో తమకు వస్తున్న ఓట్ల గురించి చెప్పింది. కూటమికి, ఇతర పార్టీలకు పెద్దగా హోల్డ్ లేదని… చెప్పింది. సోషల్ మీడియాలో  పలు రకాల సర్వేలు కారు పార్టీకి అనుకూలంగా చక్కర్లు కొట్టాయి. ఇతరులకు ఏమీ లేదని చర్చ కూడా జరిగింది. ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి కారు పార్టీ మైండ్‌గేమ్ ఆడింది. ఆ తర్వాత సర్వేల గురించి చెప్పింది. సభల్లోనూ  అధినేత అదే మాట పదేపదే చెప్పారు. ఇతరులకంటే తాము చాలా దూరంలో ఉన్నామని గెలుస్తున్నామని చెప్పారు.

ఇదో  మైండ్ గేమ్. చివరకు రాజగోపాల్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్‌గేమ్ మొదలైంది. ప్రచారాలు ముగియడానికి ముందు గేమ్ పీక్ స్టేజీకి వెళ్లింది. ఎవరి మైండ్‌గేమ్ ఎలా ఉన్నా ఓటర్లు ఆడే గేమ్ వేరేగా ఉంటుంది. వారికి ఎవరిష్టమో…. ఎవరు ఇష్టం లేదో ఓటుతో ఓటర్లూ గేమ్ ఆడ్తారని రాజకీయ పండితులు అంటున్నారు.