నా తండ్రి హంతకుడు.. మీరే కాపాడాలి - MicTv.in - Telugu News
mictv telugu

నా తండ్రి హంతకుడు.. మీరే కాపాడాలి

October 25, 2017

‘నా తండ్రి గతంలో  ప్రేమజంటలను విడగొట్టి, అబ్బాయిలను హత్య చేసేవాడు.. ప్రేమ పెళ్లి చేసుకున్న మమ్మల్నీ చంపుతానంటున్నాడు. మీరే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి’..  ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ అనే అమ్మాయి పోలీసులకు భయంతో చేసిన ఫిర్యాదు ఇది. వివరాల్లోకి వెళితే..  బషీర్ బాగ్‌కు చెందిన బీజేపీ దళితమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పందిర్ల ప్రసాద్ కూతురు స్నేహ(24), అశ్విన్‌కుమార్ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు, వీళ్ల ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో స్నేహకు కుటుంబ సభ్యులనుంచి బెదిరింపులు మొదలయ్యాయి.

ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ ప్రేమజంట, ఈ మధ్యే  చర్లపల్లిలోని దళిత కల్యాణ వేదిక కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మరోవైపు కూతురు కనిపించడంలేదని స్నేహ తండ్రి ప్రసాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతేకాదు కూతురు జాడ తెలుసుకున్నాడు. ‘మా నాన్న నన్ను ఇంటికి తిరిగి రావాలంటూ, బెదిరింపులు, వార్నింగ్ ఇస్తున్నాడు. అతని నుంచి నాకు, నా భర్తకు ప్రాణహాని ఉంది’ అని స్నేహ.. సెంట్రల్ జోన్ డీసీపీకి  కలిసి రక్షణ కల్పించాలని కోరింది. అయితే  కని పెంచి పెద్ద చేసిన తండ్రి.. ప్రేమజంటలను విడదీసి అబ్బాయిలను హత్య చేశాడని స్నేహ చెప్పడం కలకలం సృష్టిస్తోంది. ఆమె ఆరోపణలను నిర్ధారించుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంబించారు.