తమ్ముడి వేధింపులు.. సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్యాయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

తమ్ముడి వేధింపులు.. సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్యాయత్నం

April 5, 2018

వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అది నచ్చని ఆమె తమ్ముడు పలుమార్లు వేధించడంతో వారిద్దరూ  పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆ ఘటనలో అతను చనిపోగా ఆమె చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం గోదావరి నది వద్ద చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన జంగా హరినాథ్‌(48) భార్య చనిపోయింది. దీంతో అతను మల్హర్‌ మండలం కొయ్యూర్‌కు చెందిన శ్యామలకు దగ్గరయ్యాడు. మూడేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా వీరిద్దరి సహజీవనం సాఫీగానే సాగింది. కానీ అక్క వ్యవహారం నచ్చని ఆమె చిన్న సోదరుడు పండ్ల రాములు పలుమార్లు వారితో గొడవకు దిగాడు. ఇంటికొచ్చి దాడికి కూడా పాల్పడ్డాడు. అయినా సరే, హరినాథ్ – శ్యామల కలిసే ఉంటున్నారు.రాములు వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. అతని వేధింపులు భరించలేక బుధవారం ఉదయం 7.30గం. సమయంలో ఆ జంట ఆత్మహత్యకు యత్నించింది. కాళేశ్వరంలోని గోదావరి నదిలోని వీఐపీ ఘాట్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హరినాథ్‌ అక్కడికక్కడే మృతిచెందగా, శ్యామల అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వారిని గమనించిన కొందరు వెంటనే వారిని 108లో  మహదేవ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

పోలీసులకు సంఘటనా స్థలం వద్ద వారి వెంట తెచ్చుకున్న సంచి దొరికిది. అందులో వారికి ఒక సూసైడ్ నోట్ లభించింది. అందులో ‘ నా చిన్న తమ్ముడు పండ్ల రాజు తరచూ వేధిస్తున్నాడు. మమ్మల్ని విడదీయటానికి ప్రయత్నిస్తున్నాడు. మాపై దాడి చేసి దూరం చేస్తున్నాడు. అయినా మేమిద్దరం ఒక్కటయ్యాం. చంపుతానని బెదిరిస్తున్నాడు. మీరే చావండి.. లేదా నేనే చంపుతా అని హెచ్చరిస్తున్నాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం ’ అని సూసైడ్ నోట్‌లో శ్యామల పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.