గర్భవతి కడుపులో తన్నిన సీపీఎం నేత.. - MicTv.in - Telugu News
mictv telugu

గర్భవతి కడుపులో తన్నిన సీపీఎం నేత..

February 15, 2018

కేరళలో దారుణం జరిగింది.. ఒక మహిళను.. అందులోను గర్భవతిని  అధికార మదమెక్కి  ఓ వ్యక్తి  కడుపులో తన్నాడు. కోజికోడ్‌లో ముప్పై ఏళ్ల వయసున్న ఓ మహిళ భర్తకు .. పొరుగింటి వాాళ్లకు మధ్య  చిన్న గొడవ అయ్యింది. మాటా మాటా పెరిగి ఇరు కుటుంబాల వారు కొట్టుకునే దాకా పోయారు. అయితే  4 నెలల గర్భవతి అయిన మహిళ తన భర్తపై పొరుగింటివారు దాడి చేయబోతుంటే  అడ్డుకోబోయింది. అందులో ఒకడు  కోపంతో  ఆమె కడుపులో  తన్నాడు. గర్భవతి కావడంతో  దెబ్బ గట్టిగా తగలడంతో రక్తస్రావమైంది.  స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా  కడుపులోనే బిడ్డ చనిపోయిందని  డాక్టర్లు ఆమెకు అబార్షన్ చేశారు.

 
నా బిడ్డను కడుపులోనే చంపేసిన  వాళ్లను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశింది. అయితే కడుపులో తన్నిన  వ్యక్తి  ఓ సీపీఎం నేత కావడంతో అతని అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే కేసు వాపస్ తీసుకో..లేకపోతే చంపేస్తాం అని బాధిత మహిళకు  వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పింది. నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేసింది. దాడి చేసిన ఓ వ్యక్తిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కడుపులో తన్నిన సీపీఎం నేత మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.