సీపీఎం వాళ్లు చంపేస్తారు.. కాపాడండి.. - MicTv.in - Telugu News
mictv telugu

సీపీఎం వాళ్లు చంపేస్తారు.. కాపాడండి..

February 10, 2018

సీపీఎం పార్టీ నుండి బీజేపీలోకి మారిన ఓ వ్యక్తికి  సీపీఎం కార్యకర్తల నుండి బెదిరింపులు మొదలయ్యాయి. తిరిగి పార్టీలోకి రమ్మని నిత్యం వేధిస్తున్నారని బాధితుని కూతురు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన కేరళలోని కసరగాడ్ జిల్లాలో జరిగింది. ఆ జిల్లాలో సీపీఎంకు మంచి పట్టుంది. చాలా ఏళ్లు ఆ పార్టీలో వున్న సుకుమారన్ కారణాలేంటో తెలీదు హఠాత్తుగా ఆ పార్టీని  వీడి కమలంలోకి చేరారు. అసలే బీజేపీకి, సీపీఎంకు అస్సలు పడదు.

తమ పార్టీ వ్యక్తి తమ వ్యతిరేక పార్టీలోకి మారడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. 9 వ తరగతి చదువుతున్న తన కూతురు అశ్వినిని రోజూ స్కూలు తీసుకెళ్ళడం, తీసుకురావడం చేస్తుంటాడు సుకుమారన్. కాగా సీపీఎం కార్యకర్తలు దారి కాచి అతణ్ణి అడ్డుకొని బెదిరింపులకు దిగుతున్నారు. పార్టీలోకి తిరిగి రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను చవిచూస్తావని హెచ్చరించారు. కానీ సుకుమారన్ వారి బెదిరింపులకు అస్సలు తొణకలేదు.

ఈ క్రమంలో తన తండ్రిని బెదిరిస్తున్న సీపీఎం కార్యకర్తల మీద తగు చర్యలు తీసుకోవాలని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొంటూ పోస్ట్ చేసింది అశ్విని. నేను స్కూలుకు వెళ్లాలన్నా వారికి భయపడాల్సి వస్తోంది. వారికి కనిపించకుండా దాక్కొని స్కూలకు వెళ్తున్నానని తెలిపింది. దీంతో నెటిజన్లు ఆమెకు మద్దతు పలికారు. దీనిపై సీపీఎం నేతలు స్పందించారు. ‘ సుకుమారన్ పబ్లిసిటీ కోసమే తన కూతురితో ఈ వీడియో చేయించాడు. అతనొక సాధారణ కార్యకర్త. గతంలో కాంగ్రెస్‌లో వుండి బీజేపీలో చేరాడు. అతణ్ణి బెదిరించాల్సిన అవసరం తమకు లేదు ’ అన్నారు. దీనిపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. సుకుమారన్ బలమైన నేత అని, బెదిరింపులకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని, సీపీఎం వాళ్లు నివేదిక ఇవ్వాలని ఆందోళనకు దిగారు.