mictv telugu

ఇండియాలో లూటీ.. దుబాయ్‌లో వ్యాపారం..

December 6, 2018

ఇండియాలో దొంగతనం చేసి దుబాయ్‌లో హోటల్ వ్యాపారం ఏర్పాటు చేసుకుందామనుకున్న దొంగల ముఠా పథకాన్ని గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. నగరంలోని పాతబస్తీకి చెందిన ఖలీల్‌ ముఠా సభ్యులైన ఆరుగురిని అరెస్టు చేసి సుమారు 2కిలోల ఐదు గ్రాముల బంగారు, 3,039 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాతబస్తీకి చెందిన మహ్మద్‌ ఖలీల్‌ అలియాస్‌ షరీఫ్‌ అలియాస్‌ అతీఖ్‌, నూనావత్‌ శివ అలియాస్‌ జబ్బార్‌ పాత నేరస్థులు. దొంగతనం కేసుల్లో చిలకలగూడ పోలీసులు 2016లో అరెస్ట్‌ చేయడంతో చంచల్‌గూడ జైలుకెళ్లారు. అక్కడ వీరికి మీర్‌ సజ్జాద్‌ అలీ అలియాస్‌ సజ్జు పరిచయమయ్యాడు.

2017 సెప్టెంబరులో జైలు నుంచి సజ్జు విడుదలైన అనంతరం ఖలీల్‌, జబ్బార్‌ విడుదల కోసం బెయిల్ తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి ఇళ్ల చోరీలకు ప్లాన్ చేశారు. రెండు నుంచి మూడు కోట్లు దొంగలించి దుబాయ్‌లో హోటల్‌ వ్యాపారంలో స్థిరపడాలని భావించారు. ప్లాన్‌లో భాగంగా ముందుగా సజ్జు దుబాయ్‌కి వెళ్లి చోరీలకు మాస్టర్ మైండ్‌లా వ్యవహరించాడు. వారికి మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులతో పాటు ముంబయిలో స్థావరాల్ని ఏర్పాటు చేశాడు. అతడి సూచనతోనే ఖలీల్‌, జబ్బార్‌ చోరీలు చేసేవారు. తొలుత తాము ఎంచుకున్న నగరానికి వెళ్లి అక్కడ కారు లేదా మోటార్ సైకిల్‌ని చోరీ చేసేవారు. దానిపైనే రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు వీధుల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేసేవారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 84కి పైగా చోరీలకు పాల్పడ్డారు. అలా చోరీ చేసిన సొత్తును ఖలీల్‌, జబ్బార్‌లు నేరుగా ముంబయికి తీసుకెళ్లేవారు.Telugu News dacoits plan to rob here and set hotel business in dubaiసజ్జూ సూచనలతో అతడి అనుచరులైన సాగర్‌ సంజీవ్‌ పగారే, సయ్యద్‌ కరార్‌ హుస్సేన్‌ రజ్వీ, మీర్‌ ముస్తఫా అలీ రజ్వీ, అజీజ్‌ అహ్మద్‌ఖాన్‌, ముజ్జుకు అప్పగించేవారు. అనంతరం ఆ సొత్తును సజ్జూ సోదరుడు అస్ఘర్‌అలీ నగదుగా మార్చి వెస్ట్రన్‌ మనీ యూనియన్‌ ద్వారా దుబాయ్‌కి  పంపించేవాడు.

పార్టనర్ హత్యకు పథకం..

ఇంతలో వీరి మధ్య విబేధాలు వచ్చాయి. చోరీ డబ్బుని దుబాయ్‌లో ఉన్న సజ్జూకు ఎందుకు పంపాలని… మనమే పంచుకుందామని ఖలీల్‌పై జబ్బార్‌ ఒత్తిడి తెచ్చాడు. ఖలీల్‌ ఆ విషయాన్ని సజ్జూకు చెప్పడంతో ఇద్దరు కలిసి జబ్బార్‌‌‌ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. పథకంలో భాగంగా మార్చిలో జబ్బార్‌ను ఖలీల్‌ మహారాష్ట్రలోని జాల్నాకు తీసుకెళ్లి మద్యం తాగించి బండరాయితో తలపై దాడి చేసి చంపేశాడు. అనంతరం ఖలీల్‌ ఒక్కడే చోరీలు చేసి సొత్తును నగదుగా మార్చేందుకు హైదరాబాద్‌లోనే సజ్జు తండ్రి మీర్‌ ముస్తఫా అలీ అలియాస్‌ తాయాతో పాటు రజియా, సల్మాన్‌, పర్వీన్‌, సందీప్‌, గజానంద్‌, సమీర్‌పటేల్‌, మన్నాన్‌ పటేల్‌కు అప్పగించేవాడు.

మియాపూర్‌, రాజేంద్రనగర్‌లలో జరిగిన చోరీల దర్యాప్తుపై డీసీపీ జానకి శర్మిల, శంషాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ చోరీల వెనుక ఖలీల్‌ ముఠా హస్తం ఉందని తేలడంతో ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, రామయ్య, ఎస్సై మురళీ బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో చోరీకి యత్నిస్తూ ఖలీల్‌, సర్వర్‌, జరార్‌, ముజ్జు, రజియా, సల్మాన్‌ పోలీసులకు చిక్కారు.