తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు.. కొడుకులు వుండికూడా... - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు.. కొడుకులు వుండికూడా…

October 7, 2018

చిన్నగున్నప్పుడే వాళ్ళు మన పిల్లలు.. పెద్దయ్యాక వాళ్ళు మన ఆస్తులు తప్పించి మనలను పంచుకోరని అక్కడక్కడా కొందరు కొడుకులు నిరూపిస్తున్నారు. తల్లిదండ్రులకు తీవ్ర నిరాశను కలిగిస్తున్నారు. ఇది అలాంటి ఘటనే. పెళ్లీడు రాగానే పెళ్లి చేసుకున్నాడో కొడుకు. అత్తారింటికి ఇల్లరికం అల్లుడిగా వెళ్ళాడు. అప్పటినుంచి ఆ కొడుకుకు అత్తవారిల్లే అన్నీ అయనట్టు అక్కడే వుండిపోయాడు. ఎప్పుడూ ఇటు ఇంటివైపు తొంగిచూసిన పాపానికి పోలేదు. జీవితకాలంపాటు ఆ తల్లిదండ్రులకు కానని కొడుకే అయ్యాడు. 40 ఏళ్ళ తర్వాత తండ్రి చనిపోతే అప్పుడు అతనికి తండ్రి గుర్తొచ్చాడ. తలకొరివి పెడతానని ముందుకొచ్చాడు.

Daughter perform last rites of their father in hyderabad

కానీ తోబుట్టువులు, సోదరుడు వద్దన్నారు. ఈ విషయమై వారిమధ్య వాగ్వాదం ముదిరింది. ఊరోళ్ళు కల్పించుకుని సర్దిచెప్పారు. చివరికి ఆ తండ్రికి కూతురే తలకొరివి పెట్టింది.

కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మయ్య(90) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు వున్నారు. 40 ఏళ్ళ క్రిందటే పెద్దకొడుకు రామ్ చందర్ అదే గ్రామంలో ఇల్లరికం వెళ్లాడు. అప్పటినుంచి రామ్ చందర్ తల్లిదండ్రులను పట్టించుకున్న పాపాన పోలేదు. తల్లిదండ్రులు, తోబుట్టువులను పరాయివాళ్ళలా భావించాడు. చిన్న కుమారుడు వెంకటేశం వారి బాగోగులు చూసుకోవడమే కాదు, తన ఐదుగురు చెల్లెళ్లకు వివాహాలు చేశాడు.

ఇంత చేసిన తన చిన్న కుమారుడు వెంకటేశంకే తన ఆస్తి చెందాలనుకున్నాడు ఆ పెద్దమనిషి. ఆస్తంతా చిన్న కొడుకుకు చెందేలా వీలునామా రాశాడు. అనారోగ్యం పాలైన లక్ష్మయ్య శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

తండ్రి మరణవార్త తెలిసిన రామ్ చందర్‌ అక్కడకు వచ్చాడు. తండ్రికి తాను తలకొరివి పెడతానన్నాడు.

కానీ అందరూ అతణ్ణి తలకొరివి పెట్టడానికి వీల్లేదని అన్నారు. దీంతో అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్లతో అతనికి వాగ్వాదం ముదిరింది. ‘ఇన్నేళ్ళలో ఎప్పుడూ కన్నవాళ్ళను పట్టించుకోలేని నువ్వు ఇప్పుడు తలకొరివి పెట్టడానికి వచ్చావంటే ఖచ్చితంగా ఆస్తికోసమే వచ్చావని’ వాళ్లంతా వాదించారు. తండ్రి శవం వద్దే సంతానం గొడవపడటంతో బంధువులు, ఇరుగుపొరుగువారు కలగజేసుకొని సర్దిచెప్పారు. ఇద్దరు కొడుకులు నువ్వానేనా అని పోట్లాడుకోవడం చూసిన చిన్న కుమార్తె రాణి తాను తండ్రికి తలకొరివి పెడతానని ముందుకువచ్చింది. ఊరందరు కూడా రాణి మాట సరేనన్నారు. ఇద్దరు కొడుకులుండి కూడా లక్ష్మయ్య కూతురితో తలకొరివి పెట్టించుకున్నాడని స్థానికులు వాపోతున్నారు.