పగటి నిద్ర మెదడుకూ చేటు

తినే వేళకు తినాలి, పడుకునే వేళకు పడుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎవరు  టైంకి పడుకుంటున్నారు? తింటున్నారు? స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అని రాత్రి నిద్రను మరిచిపోయి, పగటి నిద్రకు అలవాటు పడుతున్నారు. అయితే పగటిపూట కునికిపాట్లు భవిష్యత్‌లో అల్జీమర్స్‌(మతిమరపు) వ్యాధి వచ్చేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది.

2009 నుంచి 2016 వరకు 70 ఏళ్లు పైబడిన  పదవీ విరమణ చేసిన దాదాపు 300 మందిపై అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వారి బ్రెయిన్‌ స్కాన్స్‌ను పరిశీలించగా పగటిపూట నిద్రించని వారితో పోలిస్తే బాగా నిద్రపోయిన వారి మెదడులో అల్జీమర్స్‌ కారకాలు పెరిగాయని స్పష్టం చేశారు

పగటిపూట నిద్రించిన వారి మెదడులో అల్జీమర్స్‌కు దారితీసే కారకాలు ప్రేరేపితమయ్యాయని వెల్లడించారు. రాత్రిపూట నిద్రపట్టని వారు పగటిపూట కునికిపాట్లు తీస్తే అది అల్జీమర్స్‌కు దారి తీస్తుందని పేర్కొన్నారు. మయో క్లినిక్‌కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వృద్ధులు పగలు అతిగా నిద్రపోవడం మంచిది కాదని తేలింది. జామా న్యూరాలజీ జర్నల్‌లో ఈ పరిశోధన సారాంశం ప్రచురితమైంది.