మేడారం ట్రాఫిక్‌లో బాలింత మృతి.. ప్రభుత్వం ఏం చేస్తోంది ? - MicTv.in - Telugu News
mictv telugu

మేడారం ట్రాఫిక్‌లో బాలింత మృతి.. ప్రభుత్వం ఏం చేస్తోంది ?

January 31, 2018

ఇవాళే మొదలైన మేడారం జాతరలో అపశృతి నెలకొన్నది. ఇసుక పోస్తే రాలనంత మంది భక్తులు మేడారానికి తరలి వచ్చారు. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల ఆమె మరణించడం కలకలం రేపుతున్నది. గర్భిణీ అయిన కళాబాయి రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి జాతరకు వచ్చింది.

ఇంతలో ఆమెకు నొప్పులు రావటంతో ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కళాబాయికి అధిక రక్తస్రావం అవడంతో ములుగు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సరిగ్గా ఇక్కడే వారికి ట్రాఫిక్ సమస్య ఎదురయ్యింది.

కళాబాయిని తీసుకెళ్తున్న అంబులెన్స్ మేడారం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అధిక రక్తస్రావంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన కళాబాయి సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో మృతి చెందింది. కళాబాయి మరణ వార్త తెలిసి చాలా మంది భక్తులు బాధపడ్డారు. జాతర బందోబస్తుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం ప్రగల్భాలు పలకి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా వుంది. అంబులెన్స్, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ పోలీసుల నియామకం, పోలీసు బందోబస్తు వంటివి సక్రమంగా వున్నాయా లేదా అని చూసుకుంటే ఇలాంటి మరణాలు తప్పుతాయని వాపోతున్నారు.