వాట్సాప్‌లో ఒకసారి పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసుకునే అవకాశం వుండదు. పొరపాటుగా ఒకరికి పంపాల్సిన మెసేజ్ ఇంకొకరికి పంపినప్పుడు అయ్యో అని తల పట్టుకోవాల్సి వస్తుంది. డిలీట్ చేద్దామంటే ఆ అవకాశం వుండదు.
సవరించుకునే వెసలుబాటు లేదు.. అయితే వినియోగదారుల ఈ ఇబ్బందిని గమనించిన వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఫీచర్‌తో ఇక మునుపటిలా మెసేజ్‌లో ఏదైనా తప్పు పోయినప్పుడు తల పట్టుకోవాల్సిన అవసరం వుండదు. ఒకరికి పంపాల్సిన మెసేజ్ ఇంకొకరికి పోయిందే.. ఇప్పుడెలా.. అని విస్తుపోవాల్సిన అగత్యం ఇకనుండి అస్సలు వుండదు. ఈ సరికొత్త ఫీచర్‌తో ఏడు నిమిషాల వ్యవధిలోనే మెసేజ్‌ను డిలీట్ చేసుకునే వెసలుబాటు వుంటుంది. ఒకవేళ ఈ వ్యవధిలో డిలీట్ చేయకపోతే, ఆ మెసేజ్ పంపిన వారి ఇన్‌బాక్స్‌లోకి అది వెళ్లిపోతుంది.
మెసేజ్‌లను డిలీట్ చేసే క్రమంలో రెండు ఆప్షన్లను ఇచ్చారు. ఒకటేమో ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ రెండవది ‘డిలీట్ ఫర్ మీ’. మొదటి ఆప్షన్‌తో యూజర్ చాలామందికి లేదా రిసీవర్‌కు పంపిన మెసేజ్‌ను వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. ఇక రెండవ ‘డిలీట్ ఫర్ మీ’ ఆప్షన్‌తో కేవలం యూజర్ చాట్ నుంచి మాత్రమే మెసేజ్‌ను తొలగించవచ్చు. మెసేజ్‌ను అందుకునే వారి ఇన్‌బాక్స్‌లో ఆ మెసేజ్ అలానే ఉంటుంది. మరి ఈ కొత్త ఫీచర్ కావాలంటే వాట్సాప్ కొత్త వెర్షన్‌ను కలిగి వుండాల్సి వస్తుంది.
ఇందుకోసం వాట్సాప్‌ను అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫీచర్ ఐఓఎస్, విండోస్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అందుబాటులో ఉంది. ఇక నుండి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో గ్రూపుకు సింక్ కాని లింకులు, మెసేజ్‌లు, వీడియోలు షేర్ చెయ్యటం వల్ల అడ్మిన్ల నుండి, గ్రూపు సభ్యుల నుండి నిరసనలు వినిపిస్తుంటాయి. అప్పుడు పంపినతను చాలా అవమానంగా ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడలా కాకుండా నిరసన జరిగిన గ్రూపులోంచి వెంటనే తము షేర్ చేసినదాన్ని నిష్క్రమింపజేయవచ్చు