కుక్కకు సారీ చెప్పలేదని మనిషిని చంపేస్తారా ? - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కకు సారీ చెప్పలేదని మనిషిని చంపేస్తారా ?

October 7, 2018

ఈ రోజుల్లో మనుషులు ఒకరిపై ఒకరు ఎలా కోపం పెంచుకుంటున్నారో.. ఎందుకు పగలు పెంచుకుంటున్నారో అర్థం కావటంలేదు? పక్కింటివాళ్ళ మీద కోపంతో కుక్కపై, పిల్లిపై, కోళ్ళపై వేసి తిట్టుకునేవారు. అలా తమ పంతం నెగ్గించుకునేవారు. కానీ వీళ్ళు వాళ్ళకన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టున్నారు. తమ కుక్కకు సారీ చెప్పలేదని ఓ యువకుణ్ణి కొంతమంది కలిసి చంపేశారు. విస్మయానికి గురిచేస్తున్న ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ మోహన్ గార్డెన్ ప్రాంతంలో మినీ-ట్రక్కు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు విజేందర్ రాణా (40).

What's the worst thing ... will you kill a man who says sorry to the dog

ఈక్రమంలో అతను పని ముగించుకుని శనివారం అర్థరాత్రి ఇంటికి వచ్చాడు.  తన మినీ-ట్రక్కును ఖాళీ స్థలంలో పార్కింగ్ చేస్తున్న సమయంలో అతడి ఇంటికి సమీపంలో ఉండే ముగ్గురు తమ పెంపుడు కుక్కతోసహా వీధిలో వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో విజేందర్ ట్రక్కు ఓ కుక్కను రాసుకుంటూ పోయింది. దీంతో అది అరిచింది. ఆగ్రహించిన కుక్క యజమాని తన తోటివాళ్ళతో విజేందర్ మీదకు వెళ్ళాడు.

తన కుక్కకు సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు. అందుకు విజేందర్ సారీ చెప్పనన్నాడు. కుక్కను కంట్రోల్లో పెట్టుకోండని చెప్పాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఆ జంతు ప్రేమికులు తమ ఉన్మాదాన్ని ప్రదర్శించసాగారు. కూరగాయలు తరిమే కత్తులు, స్క్రూడ్రైవర్‌తో దాడిచేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి విజేందర్ రక్షించమంటూ కేకలువేస్తూ చాలా దూరం వరకు పరుగెత్తాడు. అతడి సోదరుడు రాజేశ్ రాణా (45) ఇంట్లో నుంచి పరుగెత్తుకొచ్చాడు. ఆయనపై కూడా దాడిచేసి మూడుసార్లు కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం దీని దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడు. నిందితుల్లో ఇద్దరు అన్నదమ్ములు కాగా, మరొకరు వారికి బంధువు. వీరిని అంకిత్, పరాస్, దేవ్ చోప్రాలుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. విజేందర్ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. విజేందర్ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.