ఢిల్లీలో ఆడ దుశ్శాసినులు! - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో ఆడ దుశ్శాసినులు!

December 8, 2017

ఢిల్లీలో మద్యం భూతం కొందరు మహిళలతో ఇంకొక మహిళను దారుణంగా అవమానించింది. లిక్కర్ మాఫియాను పట్టించిందన్న కారణంతో ఓ మహిళపై తోటి మహిళలే అతి దారుణంగా ప్రవర్తించారు. ఆమెను దారుణంగా కొట్టడమేగాక, నడి రోడ్డుపైన నగ్నంగా ఊరేగించారు. మద్యాన్ని వ్యతిరేకించిన మహిళను గౌరవించాల్సింది పోయి ఆమెను అతి హీనంగా సాటి మహిళలే అవమానించిన ఘటన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగింది.

ఆ ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు అక్రమంగా మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆ విషయాన్ని ఓ మహిళ ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం అందించింది. మహిళా కమిషన్ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో గురువారం రాత్రి ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు.  ఓ ఇంటి నుంచి దాదాపుగా 300 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెళ్లగానే సమాచారం ఇచ్చిన మహిళపై  మద్యం అమ్మే మహిళలు దాడి చేశారు. ఆమెను ఇనుప రాడ్టుతో కొట్టి, ఆమె ఒంటి మీదున్న దుస్తులు చించేసి నగ్నంగా ఊరేగించారు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళ చెబుతున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మద్యం  అక్రమంగా అమ్మితే వ్యతిరేకంగా మాట్లాడుతావా అంటూ బెదిరించారని, కొట్టారని బాధితురాలు వీడియోలో పేర్కొంది.         ‘ నున్న రోడ్డు మీదకు లాకొచ్చి కొట్టారు. నా దుస్తులు కూడా చించేశారు. ఓ పోలీసు అడ్డుకునేందుకు ప్రయత్నించగా , ఆయనను కూడా కొట్టారు ’ అని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు మాత్రం భిన్నంగా చెబుతున్నారు. మహిళపై దాడి జరిగింది నిజమే కాని ఆమెను నగ్నంగా ఊరేగించలేదని చెప్పడం  గమనార్హం.

ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఘాటుగా స్పందించారు. సిగ్గుపడాల్సిన విషయమని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బెజాల్‌ను కోరారు. ‘ దేశ రాజధానిలో అత్యంత దిగ్బ్రాంతికర, సిగ్గుపడాల్సిన ఘటన ఇది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వెంటనే స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు భద్రత కల్పించాలి ’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.