ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు... - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు…

April 16, 2018

ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యుడినని చెప్పుకుని తిరుగుతున్న వ్యక్తిని  పోలీసులు అరెస్టు చేశారు. బీహర్‌కు చెందిన అద్నాన్ ఖుర్రం (19) ఐదు నెలల నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యుడుగా చలామణి అవుతున్నాడు. కొందరికి తాను జూనియర్ రెసిడెంట్ డాక్టర్‌నని,మరికొంతమంది వైద్యులకు మెడికల్ విద్యార్థినని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఐదు నెలలుగా ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులను,సిబ్బందిని మభ్యపెడుతూ వైద్యుడిగా ఉంటున్నాడు. ఆసుపత్రిలోని మెడికల్ విద్యార్థులు పాల్గొనే ప్రతీ కార్యక్రమంలో పాల్గునేవాడు.ధర్నాలు, మారధాన్‌లు ఇలా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. అయితే శనివారం ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన మారథాన్ సందర్భంగా కొందరు వైద్యులకు అద్నాన్‌పై అనుమానం వచ్చింది. దీంతో అతడిని  ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, మెడిసిన్స్‌‌పై అతడికున్న అవగాహన, ఎయిమ్స్‌లో వైద్యుల పేర్లు, ఇతర విభాగాలకు సంబంధించి అతని వద్దనున్న సమాచారం చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు ఇప్పటివరకు లేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని బాట్లా హౌస్‌ సమీపంలో ఉంటున్న అద్నాన్ సోషల మీడియా ఖాతాలో తెల్లకోటు, స్టెతస్కోప్‌ పట్టుకుని దిగిన చాలా ఫొటోలు ఉన్నాయని తెలిపారు. తన కుటుంబంలోని వ్యక్తులకు  మంచి వైద్యం అందించడానికి వైద్యుడిగా మారానని , తనకు వైద్యులతో సమయం గడపడం చాలా ఇష్టమని చెప్పాడు. మరోసారి, వైద్యుడిని కావాలని అనుకున్నానని పోలీసులను అయోమయానికి గురి చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.