mictv telugu

వర్మ నుంచి నేనే తప్పుకున్నా…

February 11, 2019

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నట్టే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ‘వర్మ’ సినిమా నుంచి దర్శకుడు బాలా తప్పుకున్నారు. ఎన్టీఆర్ షూటింగ్ మొదలవకముందే తేజ తప్పుకున్నారు కానీ బాలా, వర్మ షూటింగ్ సాంతం అయిపోయాక తప్పుకోవడం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తానే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించారు. చిత్ర నిర్మాతలు తనమీద అసత్య ప్రచారం చేస్తుండటంతో తాను బయటికి వచ్చి వివరణ ఇస్తున్నానని అన్నారు.

ఇప్పటివరకు తీసిన సినిమా రషెస్ సంతృప్తికరంగా లేవని, వేరే దర్శకుడు, నటీనటులతో మళ్ళీ రీషూట్ చేస్తామని ఇటీవల నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బాలా మీద ఒత్తిడి పెరగడంతో బయటకు వచ్చి తన సృజనాత్మకతను కాపాడుకోవడానికి‌, విక్రమ్, ధృవ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ వివాదానికి ఇంతటితో తెర దించడానికే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు బాలా. బాలా స్థానంలో దర్శకుడిగా గౌతమ మీనన్ పేరు వినిపిస్తోంది. ధృవ్ ను మారుస్తారని తెలుస్తోంది. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ నటన చూశాక ధృవ్ నటన ఎబ్బెట్టుగా అనిపించింది. ఏమో తమిళ ప్రేక్షకులకు నచ్చుతుండొచ్చు అనుకున్నారు. తొలుత నుంచి మళ్ళీ రీషూట్ అంటే నిర్మాతలకు తడిసి మోపెడు అవుతుందనే టాక్ కోలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.

అయినా బాలా సినిమా సరళి పూర్తిగా భిన్నమైంది. ఆయన తొలుతనుంచి గ్రామీణ నేపథ్యంలో, డీ గ్లామర్ చిత్రలనే తీసి తనదైన ముద్ర వేసుకున్నారు.అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ పూర్తిగా ఆయన మేకింగ్ స్టైల్ కు భిన్నమైంది. ఏది ఏమైనప్పటికీ సినిమా మొత్తం షూటింగ్ ముగించుకున్నాక ఇలా జరగడం అటు దర్శకుడికి, నిర్మాతలకే కాదు నటీనటులకు, టెక్నీషియన్లకు పెద్ద స్ట్రోక్ లాంటిదే. ఈ చిత్రాన్ని ఈ4 ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది.Telugu news Director Bala has dropped out of Varma movie