దర్శకుడిదీ, నాదీ ఒకే కథ.. ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

దర్శకుడిదీ, నాదీ ఒకే కథ.. ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి

April 2, 2018

సినిమా హిట్ అయితే ఎక్కువగా పేరొచ్చేది దర్శకుడు, హీరో, హీరోయిన్లకు. సంగీత దర్శకుడు, కెమెరామెన్‌లకు కూడా వస్తుంది. కానీ ఎడిటర్‌కు కూడా ‘గుడ్ ఎడిటర్’ అని పేరు రావటం అనేది చాలా అరుదు. అది బొంతల నాగేశ్వర్ రెడ్డి విషయంలో నిజమైంది. ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా ద్వారా నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు. మార్చి 23న విడుదల అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడినా ఎడిటర్ పేరును ఉటంకించడం విశేషం. ఈ సినిమా విజయంలో ఎడిటర్ పాత్ర కూడా కీలకం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీవిష్ణు, సాట్న టైటస్ హీరో హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు దేవీ ప్రసాద్ ముఖ్య పాత్రలో మెరిసారు.

దర్శకుడు, ఎడిటర్‌ల వే ఆఫ్ లెంత్ మ్యాచ్ అయితే ఆ సినిమా ఒక లెవల్లో వుంటుంది అని చెప్పటానికి నీదీ నాదీ ఒకే కథ విజయమే ఉదాహరణ. సినిమాకు మొట్టమొదటి ప్రేక్షకుడు ఎడిటరే అవుతాడు. టేబుల్ మీద పడివున్న ఫుటేజ్‌లోంచి ఏరికోరి సినిమాకు ఓ రూపును ఇవ్వాల్సిన బాధ్యత ఎడిటర్‌దే. డైరెక్టర్ ఎంతబాగా డైరెక్షన్ చేసినా ఎడిటర్ కాస్త అటుఇటుగా కత్తిరించినా ఆ సినిమా ఫ్లాప్ అవ్వొచ్చు. ఎడింటింగ్‌లో లోపముంటే సినిమా ఆత్మే చెడిపోతుంది. కత్తెర చేత పట్టుకున్న ఎడిటర్ చాలా జాగ్రత్తగా సినిమాను డీల్ చేయవలసి వుంటుంది. నీదీ నాదీ ఒకే కథ సినిమా విషయంలో దర్శకుడు కొత్తవాడే. ఎవరైనా కొత్త దర్శకులు తమ సినిమాకు సీనియర్ టెక్నీషియన్స్‌ను తీసుకుంటారు. కానీ వేణు ఊడుగుల మాత్రం ఎడిటర్‌గా తనను పెట్టుకోవటం సాహసం అంటున్నాడు ఈ నవయువ ఎడిటర్. దర్శకుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారంటున్నారు ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి. ఆయన మాటల్లోనే…

 

నా ప్రయాణం :

జోగులాంబ జిల్లా అలంపూర్ మండలం కోనేరు అనే గ్రామంలో జన్మించాను. సినిమా రంగానికి వచ్చే అందరిలానే నేనూ ఎన్నో కలలు కని 2005లో హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాను.  తొలుత సినిమా దర్శకుడు అయిపోదామని అనుకున్నాను. దర్శకుడు వి.వి. వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిపోదామని వెళ్ళాను. దర్శకుడిగా కన్నా నువ్వు ఎడిటర్‌గా పని చెయ్ అని సలహా ఇచ్చారు ఆయన. దీంతో ఆయన సలహా మేరకు గౌతంరాజు దగ్గర చేరిపోయాను. మార్తాండ్ కె. వెంకటేష్ దగ్గర కూడా పని చేశారు. అలా ఇద్దరి దగ్గర కలిసి సుమారుగా 70 సినిమాల వరకు అసోసియేట్ ఎడిటర్‌గా పని చేసిన అనుభవం వుంది నాకు. 2009లో వివాహం అయింది. ఒక పాప, బాబు వున్నారు. ఈ ప్రయాణంలో నాకు నా కుటుంబ సభ్యుల నుంచి చాలా సపోర్ట్ వుంది. 2002లో నాన్న చనిపోవటం నా జీవితంలో పెద్ద విషాదం.

ఈ ప్రయాణంలో దర్శకుడిది, నాదీ ఒకే కథ :

ఇద్దరం కలిసి ఈ జర్నీ మొదలు పెట్టాం. ఒకే రూంలో వుండేవాళ్ళం. పెళ్ళిళ్ళు అయేవరకు కూడా మేం ఒకే రూమ్మేట్స్. మా ఇద్దరికీ మంచి స్నేహం వుంది. ఇద్దరివీ మ్యాచ్ అయ్యే ఆలోచనలు. ఒక రూంలో వుండి చాలా విషయాల గురించి చర్చించుకునేవాళ్ళం. మంచి సినిమా చేసి తెలుగు సినీ రంగంలో మా సత్తా ఏంటో చాటాలనుకున్నాం. అలా ఇద్దరి ప్రయాణం సాగింది. ఒకరు దర్శకుడిగా, ఒకరు ఎడిటర్‌గా వెండితెరకు ఒకేసారి పరిచయమవటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎడిటర్‌గా ఈ సినిమాలో నా పేరు చూసుకున్నప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు బాధ్యత మరింత పెరిగింది. ఈ సినిమాకు మాది కొత్తగా మూడేళ్ళ వరకు సాగింది జర్నీ.

నీదీ నాదీ ఒకే కథ జర్నీ :

ఈ సినిమాకు ఎడిటర్‌గా పని చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కంటెంట్, డ్రామా వున్న సినిమాలకు ఒక ఫ్లో వుంటుంది. ఆ ఫ్లో ఎక్కడా మిస్ అవకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. నీదీ నాదీ ఒకే కథ సినిమాకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేశాను. ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ఇది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రాణం. ఎడిటింగ్ విభాగంలో రెగ్యులర్ రూల్స్ బ్రేక్ చేసి చేసిన సినిమా ఇది. ఇంటర్‌కట్ షాట్స్ లేకుండా సీన్‌లను చెక్కినంత పనే జరిగింది. ఎక్కడా ఎమోషన్ మిస్ అవకుండా సస్టెన్స్ మెయింటెయిన్ చేశాం. ఈ సినిమాలో 16వ సన్నివేశం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు నన్ను ఎడిటర్‌గా తీసుకున్నవేణు ఊడుగుల, హీరో శ్రీవిష్ణు, నిర్మాతలు ప్రశాంతి, నారా రోహిత్‌లకు ఎప్పటికీ రుణపడి వుంటాను.

గుడ్ ఎడిటర్ :

నా దృష్టిలో గుడ్ ఎడిటర్ అంటే.. అతనికి కచ్చితమైన జడ్జిమెంట్ వుండాలి. ఆర్టిస్టుల పర్‌ఫార్మెన్స్ తెలిసుండాలి. ముఖ్యంగా డైరెక్టర్ విజన్‌ను క్యాచ్ చెయ్యగలగాలి. ఓ సినిమాను డ్రస్ కుట్టే టైలర్ లాంటివాడు ఎడిటర్. ఒక షర్టు కుట్టటానికి ఎన్ని ముక్కలు కట్ చేయాలి.. ఎంత సైజులో కట్ చెయ్యలి అనేది కరెక్ట్ మెజర్‌మెంటుతో టైలర్ బట్టలను కట్ చేస్తాడు. కత్తిరించుకున్న తర్వాత వాటిని అతికిస్తూ సరిగ్గా కుట్టాలి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ షర్టు ఎందుకూ పనికిరాకుండా పోతుంది. ఇక్కడ ఎడిటర్ కూడా టైలర్ లాంటివాడే. ముక్కలుగా వున్న సినిమాను దాని టెంపో ఎక్కడా మిస్ అవకుండా అతికించాల్సి వస్తుంది.

 

ఇది నిజంగా కత్తి మీద సాములాంటి ఉద్యోగం. డ్రామా సినిమాలకు ఫుటేజ్ ఎక్కువగా వుంటుంది. కెమెరామెన్, మేకప్‌మెన్ ఇలా అందరూ టెక్నీషియన్లు పనిచేసి వెళ్ళిపోతారు కానీ ఎడిటర్ మాత్రం సినిమాకు చివరివరకు వుండాల్సి వస్తుంది. ఒక ఎడిటర్ అనేవాడు డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్, డీటీఎస్, డీఐ, సీజీ వంటి ఆరు స్టేజీలను కోఆర్డినేట్ చేయవలసి వస్తుంది.

వీళ్ళందరికీ సేమ్ రీల్ పంపించాలి. కాస్త తేడా వచ్చినా సినిమా మొత్తానికి తేడా కొడతుంది.  2010 వరకు ఈ వ‌ృత్తి మీద నెగెటివ్‌గానే వున్నాను. డిజిటల్ వచ్చాక నాలో విశ్వాసం పెరిగింది. ఎడిటర్‌గా నేను కూడా స్థిరపడొచ్చనే ధీమా కలిగింది. ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్‌లో తండ్రీ, కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సి వచ్చింది. డైలాగులు లేకుండా 6 నిమిషాల పాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేయటం సాహసమే.  

తొలి ఘనవిజయం ఇది :

చేసిన మొదటి సినిమానే ఇంత పెద్ద విజయాన్ని వరించింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి.వేణు ఊడుగులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. చిన్న చిత్రంగా విడుదలై ఇంత పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా కథ చాలా మందికి కనెక్ట్ అయింది. కథతో సంబంధం లేకుండా ఎక్కడా ఒక్క పాట కూడా లేదు. దర్శకుడు ఈ సినిమాకు తన ప్రాణం పెట్టి పని చేశాడు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ చాలా బాగా పండింది. ఈ సినిమా విడుదలైతే తెలుగులో కన్నా తమిళం, మళయాలంలో ఎక్కువ ఆడుతుందని నేనప్పుడే అన్నాను. తెలుగులో కూడా విజయవంతంగా ప్రదర్శింపబడటం చాలా సంతోషంగా వుంది. నేను ఈ సినిమాను బాగా ప్రేమించాను. వేణులో మంచి రైటర్ వున్న సంగతి మనందరికీ తెల్సిన విషయమే. కానీ అతనిలో రైటర్ కన్నా మంచి దర్శకుడు వున్నాడని మేము రూమ్మేట్స్‌గా వున్నప్పుడే బలంగా నమ్మాను. రచయితగా 200 పర్సెంట్ సక్సెస్ అయితే.. దర్శకుడిగా 400 పర్సెంట్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.

ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీవిష్ణు నటనకు ఎక్కడా పేరు పెట్టలేం. మంచి కథలను ఎంచుకుంటూ నటుడిగా ముందుకు పోతున్నాడు. ఏ కథ అయితే తనకు వర్క్అవుట్ అవుతుందో జడ్జ్ చేయగలరు శ్రీవిష్ణు. దేవీ ప్రసాద్ గారి పాత్ర ఈ సినిమాకు ఆయువుపట్టు వంటిది. హీరోయిన్ సాట్నా కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాకు నాకు మంచి పేరు వచ్చింది. చాలా మంది ఫోన్లు చేసి ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. దర్శకుడు మదన్ గారు స్పెషల్‌గా ఫోన్ చేసి అభినందించటం చాలా ఆనందంగా వుంది. కొత్త సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈ సినిమాలా మంచి కథ వున్న సినిమాలకే పని చేయాలని నిర్ణయించుకున్నాను.