స్టూడియో నిర్మాణంలోకి ఎన్. శంకర్ - MicTv.in - Telugu News
mictv telugu

స్టూడియో నిర్మాణంలోకి ఎన్. శంకర్

August 28, 2017

తెలంగాణా ఉద్యమంలో తనదైన గొంతు వినిపించిన దర్శకుడు ఎన్. శంకర్. ‘ జై బోలో తెలంగాణా ’ సినిమా తీసి ఉద్యమానికి తన వంతుగా సహకారం అందించాడు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు అప్పుడు  సినీ రంగం నుంచి మద్దతుగా నిలబడ్డాడు. ఉద్యమానికి సినిమాను ఆయుధంగా చేసుకొని బలంగా తన వాదాన్ని వినిపించాడు. తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో శంకర్ స్టూడియో నిర్మాణాన్ని చేపట్టనున్నాడు.

ఈ స్టూడియో కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా స్థలాన్ని కేటాయించడానికి సుముఖత వ్యక్తం చేసింది. కేసీఆరే స్వయంగా స్టూడియోకు కావాల్సిన స్థలాన్ని మంజూరు చెయ్యాల్సిందిగా TSIIC రంగారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

శేరిలింగం పల్లి మండలం నానాక్ రామ్ గూడా సర్వే నెంబర్ 149 లో ఎనిమిది ఎకరాలు లేదా ఖానామెట్ లోని సర్వే నెంబర్ 149/14 లో పది ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఇందుకు జిల్లా యంత్రాంగం కూడా ఆమోదిస్తూ లేఖ రాసింది. ఈ రెండు స్థలాల్లో ఏదో ఒకటి ఖరారై ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి. అది మంజూరవగానే వెంటనే స్టూడియోకు సంబంధించి పనులు వేగంగా జరపాలనే ఆలోచనలో వున్నాడట శంకర్. దర్శకుడిగా ఎన్నో సినిమాలను రూపొందించిన శంకర్ ఇక నుండి స్టూడియో అధినేతగా కూడా దర్శనమివ్వనున్నాడన్నమాట.