కోర్టు ఆదేశాల పేల్చివేత.. వందలమంది దీపావళి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టు ఆదేశాల పేల్చివేత.. వందలమంది దీపావళి అరెస్ట్

November 7, 2018

దీపావళి పండగ రోజున రెండు గంటలు మాత్రమే టపాసు కాల్చాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు వివాదాలకు దారితీస్తున్నాయి. పండగపూట ఆ కాస్త సంబరాన్నీ అడ్డుకుంటారా అంటూ పలుచోట్ల కోర్టు ఆదేశాలు ధిక్కరించి బాణసంచా మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడుతో ఉల్లంఘనలు భారీగా సాగుతున్నాయి.

ttt

సుప్రీం ఆదేశాలను అనుసరించి తమిళనాడు ప్రభుత్వం.. రాష్ర్టంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బాణాసంచా పేల్చేందుకు అనుమతి ఇచ్చింది. మరీ అంత పొద్దున ఎలా కాలుస్తామంటూ జనం చిందులేశారు. దాదాపు రాష్ట్రమంతటా ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో పోలీసులు తలలు పట్టుకుని ఇక తప్పదన్నట్టు వందల మందిని అరెస్ట్ చేశారు. పూచికత్తుపై 400 మందిని విడుదల చేసిన పోలీసులు మరో  200 మందిని కోర్టుకు  హాజరుపరచనున్నారు.  కోయంబత్తూరు, తిరుప్పూర్‌, విల్లుపురం, చెన్నై, తిరునల్వేలి తదితర ప్రాంతాల్లో వందలాది కేసులు నమోదు చేశారు.

అరెస్టులు, కేసులపై జనం తారాజువ్వల్లా మండిపడుతున్నారు. పోలీసు స్టేషన్లలోకి దూసుకొస్తున్నారు. దీంతో పోలీసులు కాళ్లావేళ్లా పడుతూ, తాము కావాలని కేసులు పెట్టడంలేదని, కోర్టు ఆదేశాలను పాటించక తప్పడం లేదని వివరణలు ఇచ్చుకుంటున్నారు.మరోపక్క.. బాణసంచా పేలుళ్లలో దేశవ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో ఒక బాలుడు చనిపోగా, పలువురు గాయపడ్డారు. కాలుష్య పెరుగుదల, ఆరోగ్యానికి హాని వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించడం తెలిసిందే.  దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 మధ్య మాత్రమే కాల్చాలి. ఇతర పండుగలకు, వేడుకలకు ఈ షరతులనే పాటించాలి.

Telugu news Diwali police arrests Many cases registered for bursting crackers outside supreme court time slot in Tamil Nadu