ఏ ఒకరిద్దరో తప్పుచేస్తే ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుబట్టొద్దు - MicTv.in - Telugu News
mictv telugu

ఏ ఒకరిద్దరో తప్పుచేస్తే ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుబట్టొద్దు

March 24, 2018

కాస్టింగ్ కౌచ్‌పై అన్నీ చిత్ర పరిశ్రమల నుంచి హీరోయిన్లు స్పందిస్తున్నారు. తెలుగులో కూడా వర్థమాన కథానాయికలు గొంతు విప్పుతున్నారు. గాయత్రి గుప్త సహా ఇప్పుడు శ్రీరెడ్డి. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వస్తే ఇక్కడ చాలా మంది దర్శకనిర్మాతలు అమ్మాయిలను ఆట బొమ్మల్లా వాడుకుంటున్నారని వారు వాదిస్తున్నారు. అవకాశాలు ఇప్పించటానికి కమిట్‌మెంట్లు అడుగుతున్నట్టు చాలా బోల్డ్‌గా చెప్పేస్తున్నారు. ఇలాంటివి జరగకూడదు, టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సులు ఎందుకు ఇవ్వరంటూ నటి శ్రీరెడ్డి పోరాడుతోంది. తనను కొందరు వాడుకున్నారని చెప్పింది శ్రీరెడ్డి. అయితే దీనిమీద ఇంతవరకు ఏ ఒక్కరూ స్పందించలేదు. ఓ టీవీ ఛానల్ లైవ్‌లో మాత్రం నటుడు ఆలీ స్పందించారు.

తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు. ‘ ఈ రోజు ఓపెన్‌గా వచ్చిన అమ్మాయిలను నేను అభినందిస్తున్నాను. అయితే ఎంత బోల్డ్‌గా వచ్చి మాట్లాడుతన్నారో అంతే బోల్డ్‌గా వారి పేర్లు కూడా బయట పెట్టండి. వారిపై చర్యలు తీసుకోవడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. వారు నిజంగా చెండాలంగా బిహేవ్ చేసి ఉంటే రూల్స్ ప్రకారం సస్సెండ్ చేసే అవకాశం కూడా ఉంది ’ అని తమ్మారెడ్డి తెలిపారు. కాగా శ్రీరెడ్డి దీనిమీద స్పందించాల్సి వుంది. పేపర్లలో, టీవీలలో వచ్చే యాడ్స్‌ను అస్సలు నమ్మవద్దని చెప్పారు. ఏ ఒకరిద్దరో చెడ్డపని చేసినంత మాత్రాన ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు.