శవంతో విశాఖ డాక్టర్ బ్లాక్‌మెయిల్ - MicTv.in - Telugu News
mictv telugu

శవంతో విశాఖ డాక్టర్ బ్లాక్‌మెయిల్

April 3, 2018

 చనిపోయిన శవాన్ని పట్టుకుని బెదిరింపులకు దిగాడు ఓ ప్రబుద్ధుడు. తనొక వైద్యుడినన్న విషయాన్ని మరిచిపోయాడు. శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు ఇలాగే వుంటారేమో అనటానికి ఇతనే నిలువెత్తు నిదర్శనం. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పీఎం పాలెంకు చెందిన కె.వెంకటేష్‌ అనే వ్యక్తి శవపరీక్షకు రూ. 10 వేలు లంచంగా ఇవ్వాలని పోస్ట్‌మార్టం చేసే డాక్టర్ ఎన్‌. దేవ్‌చంద్‌ కోరాడు. డబ్బులు ఇవ్వకపోతే మృతుడు మద్యం తాగి వాహనం నడుపుతుండగా ప్రమాదానికి గురయ్యాడని శవపరీక్ష నివేదికలో రాస్తానంటూ బ్లాక్ మెయిల్ బేరాలకు దిగాడు. విశాఖ జిల్లా కింగ్‌జార్జి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  దీంతో మృతుడి కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం శవాగారం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడినుంచి కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడి శవాగారం తమ పరిధిలోకి రాదని, ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పడంతో కేజీహెచ్‌ నుంచి ప్రిన్సిపల్‌ కార్యాలయానికి వెళ్లారు.అక్కడ కొంతసేపు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్‌ సుధాకర్‌ను కలిసి తమకు జరిగిన దారుణాన్ని వివరించారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన ప్రిన్సిపల్‌ సుధాకర్‌ వెంటనే ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన వైద్యులను పిలిపించి ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆ విచారణలో డాక్టర్ దేవ్‌చంద్ దోషిగా తేలడంతో..  ఆయన్ను శవపరీక్షల బాధ్యతల నుంచి తక్షణమే తప్పించామని తెలిపారు. శవపరీక్ష విషయంలో ఎవరైనా మామూళ్లు అడిగితే తన దృష్టికి తేవాలని ఆయన సూచించారు. చెట్టంత ఎదిగిన కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు వైద్యుడిగా ఎంతో బాసటగా నిలవాల్సింది పోయి ఇంత నీఛానికి దిగజారుతాడా.. అని స్థానికులు మండిపడుతున్నారు.