తెగిన కాలునే దిండుగా పెట్టారు...గిదేం వైద్యం రా బై ! - MicTv.in - Telugu News
mictv telugu

తెగిన కాలునే దిండుగా పెట్టారు…గిదేం వైద్యం రా బై !

March 10, 2018

నేను వోను బిడ్డో సర్కారు దవాఖానకు అని గదేదో పాటల చెప్పినట్లు..ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనను వింటే ఒరి నాయనో అని నోరెళ్ల పెడతారు. పేషెంట్ కాలునే అతని తలకింద దిండుగా పెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. స్కూల్ బస్ క్లీనర్ అయిన ఓ వ్యక్తికి  ట్రాక్టర్ గుద్దడంతో అతని కాలు తెగిపోయింది. ఆ తెగిన కాలును తీసుకుని బాధితుడు దగ్గరలో ఉన్న ఝాన్సీ గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చాడు.

అయితే డాక్టర్లు అతన్ని పరీక్షించి తెగిన కాలు అతుకుపెట్టడం సాధ్యం కాకపోవడంతో కాలుకు కట్టుకట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత అక్కడి నర్సులు, వార్డు బాయ్ లు  పేషెంట్ తలక్రింద దిండులేదని ఆ తెగిన కాలునే దిండుగా పెట్టారు. దాదాపు రెండు గంటల పాటు ఆ పేషెంట్ తలక్రింద అతని తెగిన కాలే దిండుగా ఉంది. మూడు గంటల పాటు నొప్పితో నరకయాతన అనుభవించాడు, అయినా పట్టించుకునే నాథుడే లేడు. అక్కడి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆసుపత్రులకోసం వేల కోట్లు ఖర్చుపెడుతోంది. మరి కనీసం ఆసుపత్రిలో సరిపడా దిండులు కూడా లేవంటే ఆ కోట్లన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయో ఆ దేవుడికే తెలియాలి.

ఇంతకు ముందే ఆక్సిజన్ సిలిండర్లు లేక ఘోరక్ పూర్ లోని ఆసుపత్రిలో దాదాపు 70 మందికి పైగా చిన్నారులు చనిపోయారు. ఆ సంఘటనపై ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై  దేశం మొత్తం మండిపడింది. అయినా కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఇక ప్రజలు గవర్నమెంట్ ఆసుపత్రులకు ఎలా వెళతారు? అక్కడికి వెళ్లి చచ్చిపోవడం కంటే రోగంతో ఇంట్లోనే చనిపోయింది నయం అని అనుకుంటారు? గవర్నమెంట్ ఆసుపత్రులలో ఈ పరిస్థితులు ఎప్పుడు మారతాయో ఏమో? అసలు మారతాయా? ఏమో మరి?