నిండు గర్భిణీ ప్రాణాలతో చెలగాటమాడిన వైద్యులు - MicTv.in - Telugu News
mictv telugu

నిండు గర్భిణీ ప్రాణాలతో చెలగాటమాడిన వైద్యులు

February 13, 2018

ప్రభుత్వాసుపత్రుల పనితీరు ఏ విధంగా వుంటుందో ఈ మధ్య మనం తరచూ మీడియాలో చూస్తూనే వున్నాం. డాక్టర్ల నిర్లక్ష్యం, సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందనటానికి ఈ ఉదంతం అందుకు తాజా తార్కాణం. ఓ నిండు గర్భిణి కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని డాక్టర్ చెప్పారు. వెంటనే ఆపరేషన్ చెయ్యాలని హడావిడి మొదలు పెట్టారు. సరిగ్గా ఆపరేషన్ టైంకు ఆపరేషన్ చేసే కత్తులు తుప్పు పట్టాయని గుర్తించి ఉన్నపళంగా ఆపరేషన్ రద్దు చేశారు.

అత్యంత విస్మయానికి గురి చేస్తున్న ఈ ఘటన  పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో చోటుచేసుకుంది. చెందిన కొమరిన రూపాదేవి నిండు గర్భిణి. సోమవారం స్థానిక ప్రభుత్వాస్పత్రికి డెలివరీ నిమిత్తం వచ్చిన ఆమెను వైద్యురాలు మాధవీకల్యాణి పరీక్షించారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని ఆమె చెప్పారు. దీంతో ఆమెకు ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. సర్జరీ కోసమని రూపాదేవికి ఎనస్తీషియా కూడా ఇచ్చారు.

ఇక ఆపరేషన్‌కు సిద్ధమయ్యే టైంలో కత్తులు, కత్తెరలు తుప్పు పట్టాయని చేతులెత్తేశారు. ఆ కత్తులతో ఆపరేషన్ చేస్తే పేషెంట్‌తో పాటు ఆమె కడుపులోని బిడ్డకు ఈ తుప్పుపట్టిన కత్తుల కారణంగానే ప్రమాదం వాటిల్లవచ్చనే గ్రహింపుతో ఆమెను భీమవరం తీసుకువెళ్లాలని సూచించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ గర్భిణీని ఆపరేషన్ కోసం మరో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై రూపాదేవి బంధువులు వైద్యులపై మండిపడ్డారు. వైద్యులు మాత్రం ఇందులో తమ తప్పేం లేదంటున్నారు. ఆసుపత్రిలో వారం క్రితం ఓ ఆపరేషన్‌ చేశామని, అప్పుడు కత్తులను శుభ్రం చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవి తుప్పు పట్టిపోయాయని చెబుతున్నారు. వారి సమాధానంతో పేషెంట్ బంధువులు బిత్తరపోయారు. ‘ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ ప్రాణాలు పోతే బాధ్యులెవరని ? ఆపరేషన్‌కు ఉపయోగించే పనిముట్లను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులపై, సిబ్బందిపై వుంది కదా ’ అని ఆ ఆసుపత్రికి వచ్చిన వారంతా అంటున్నారు.