ఈమె అత్త కాదు అమ్మే… కోడలికి కిడ్నీ దానం చేసి… - MicTv.in - Telugu News
mictv telugu

ఈమె అత్త కాదు అమ్మే… కోడలికి కిడ్నీ దానం చేసి…

October 2, 2018

‘అత్తలేని కోడలు ఉత్తమురాలు’ అని వారిద్దరి బంధం మీద జోకులెన్నో వచ్చాయి. టీవీ సీరియళ్ళలో అయితే అత్తాకోడళ్ళ పన్నాగాలు, పంతాలు, పట్టింపులు, చివరికి కాపురాలు కొల్లేరు ? అసలు అత్తాకోడళ్ళ మధ్య ఇంత వైరం వుంటుందా అని సీరియళ్ళు తీసే దర్శకనిర్మాతలను ప్రశ్నిస్తే, జరుగుతుందే చూపిస్తున్నాం అని వాళ్ళు తాపీగా సమాధానం చెబుతున్నారు. అత్తాకోడళ్ళు అంటే పాము-ముంగీసలేనా ? వారి మధ్య ఆప్యాయతలు, అనురాగాలు కూడా వుంటాయని చాలా తక్కువగా చూపించడం జరిగింది. కోడలిలో కూతురిని, అత్తలో అమ్మను చూసుకునే అత్తాకోడళ్ళు కూడా అక్కడక్కడా వున్నారు.

అత్త ఒకనాటి కోడలే కోడలైన రేపటి అత్తే… ఈ సత్యాన్ని ఎరిగి ఇద్దరు అత్తాకోడళ్ళు ఎంత అన్యోన్యంగా వుంటున్నారో చెప్పే కథ ఇది. అన్యోన్యతే కాదు ప్రాణాపాయంలో వున్న కోడలికి కిడ్నీ దానం చేసి కోడలు ప్రాణాలు నిలబెట్టింది అత్త. తన కిడ్నీని దానం చేసి పునర్జన్మ ప్రసాదించింది. ఇంతవరకు ఈ బంధం గురించి చాలా చెడ్డగా చూపించినవారికిది చెంపపెట్టులాంటి ఘటన. వివరాల్లోకి వెళ్తే…

She is not aunti... is the mother ... Donate a kidney to Daughter-in-law

అత్తకు కోడలు కన్న కూతురితో సమానం…

రాజస్థాన్‌లోని బాడ్మేర్ సమీపంలోని గాంధీన‌గర్‌కు చెందిన గోనీదేవి, సోనికాలు అత్తాకోడళ్లు. వారిద్దరూ తొలుతనుంచి అత్తాకోడళ్ళలా కాకుండా తల్లీబిడ్డల్లా వున్నారు. ఈ క్రమంలో గతేడాది కోడలు సోనికాకు కిడ్నీ సంబంధిత వ్యాధి సోకింది. అప్పటినుంచి చాలా ఆసుపత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారు. అయినా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూనే వస్తోంది. డాక్టర్లు, ఆమెకు వెంటనే కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని సూచించారు. లేదంటే ప్రాణాపాయం వుందని హెచ్చరించారు.

దీంతో సోనికా పుట్టింటివారిని సంప్రదించగా.. ఆమె సోదరుడు, తల్లి కూడా నిరాకరించారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి సోనికాది? ‘ఎప్పుడైతే పెళ్లి అనే బంధంతో నువ్వు మా ఇంటి కోడలివి అయ్యావో అప్పుడే నువ్వు మా బిడ్డవు అయిపోయావు. అలాంటి నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత’ అనుకుంది ఆ అమ్మలాంటి అత్త. అనుకున్నదే తడవుగా తన కిడ్నీని కోడలికి దానం చెయ్యటానికి ముందుకు వచ్చింది.

ఈ వయసులో తాను కిడ్నీ ఇస్తే తన ఆరోగ్యానికి అంతమంచిది కాదని తెలిసికూడా ముందుకు వచ్చింది. మెట్టినిల్లు ఆ కోడలికి అన్నీ అయింది. గోనీదేవి నుంచి తీసుకున్న కిడ్నీని వైద్యులు సోనినాకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కొద్ది రోజులకే సోనికా కోలుకుంది. ప్రాణాపాయంలో వున్న కోడలికి కిడ్నీ దానం చేసి ఆమె ప్రాణాలు నిలబెట్టిన అత్తకు సోషల్ మీడియా వేదికగా జేజేలు పలుకుతున్నారు.