వరకట్నం మంచిదే.. - MicTv.in - Telugu News
mictv telugu

వరకట్నం మంచిదే..

October 21, 2017

వరకట్నం ఇవ్వడం పుచ్చుకోవడం నేరం. కానీ దాని వల్ల లాభాలున్నాయట. వరకట్నం తీసుకుంటే చాలా లాభాలున్నాయంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీ పేరిట ఈ వ్యాసం విడుదల అయ్యింది. యూనివర్సిటీ పాఠ్యాంశమంటూ ఈ వరకట్నం వ్యాసం ఫేస్‌‌బుక్‌, వాట్సాప్‌లలో వైరల్ అవుతోంది. అక్కడ వరకట్న లాభాల గురించి పాఠాలు వల్లె వేస్తున్నారట. ఇంతకీ అందులో ఏం రాశారంటే.. వరకట్నం తీసుకోవటం వల్ల 7 లాభాలు అంటూ క్రింది విధంగా పేర్కొన్నారు.

ఆ లాభాలు ఇవీ..

అంద‌విహీనంగా ఉన్న అమ్మాయిలకు పెళ్ళిళ్లు కావడం కష్టం. అయితే  కట్నం ఇచ్చి వారికి సులభంగా పెళ్లి చేయొచ్చు. అధిక కట్నమిచ్చి అందమై యువకులను అల్లుళ్లుగా తెచ్చుకోవచ్చు. కట్నం  ఇవ్వడం వల్ల కొత్త జంటకు ఆర్థిక సాయంగా ఉంటుంది. అప్పులు, నిరుద్యోగం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆ కట్నం పనికొస్తుంది. ప్రతిభ వున్నా డబ్బు లేక ఇబ్బంది పడే విద్యార్థులకు కట్నం ఊతమిస్తుంది. కట్నం వల్ల అమ్మాయికి అత్తారింట్లో వేధింపులు ఉండవు. పైగా ఎక్కువ కట్నమిస్తే కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. ఎక్కువ క‌ట్నమిచ్చేవారికి సంఘంలో హోదా పెరుగుతుంది. ఆస్తిని పంపకాలు పెట్టి చట్టం ప్రకారం కూతురికి వాటా ఇవ్వడం కంటే అమ్మాయికి కట్నమిచ్చి పంపేస్తేనే లాభం…

అని సదరు పోస్ట్  చెప్పుకొచ్చింది. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  కట్నం అమ్మాయిలే ఎందుకివ్వాలి, అబ్బాయిలే కట్నమిచ్చి అమ్మాయిలను చేసుకోవచ్చుగా అని యువతులు ఘాటు కామెంట్లు పెడుతున్నారు. కట్నం వల్ల  అబ్బాయిలు మరింత సోమరిపోతులుగా తయారవుతారని కొందరన్నారు. 1961 నుంచి భారత దేశంలో వ‌ర‌క‌ట్న నిషేధం అమలులోకి వచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఇంకా అది ఓ దురాచారంగానే కొనసాగుతుండగా ప్రభుత్వాలు కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ పాఠ్యాంశం వ్యవహారంతో తమకు సంబంధం లేదన్న యూనివర్సిటీ అధికారులు ఉతన్నస్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. తమ క‌ళాశాల ఇలాంటి వాటిని ప్రోత్స‌హించ‌ద‌ని సెయింట్ జోసెఫ్ క‌ళాశాల ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్ ప్రొఫెస‌ర్ కిర‌ణ్ జీవ‌న్ చెప్పగా, సోషియాలజీ విభాగం హెడ్‌ డాక్టర్‌ బెరిన్‌ కూడా ఆ ఆరోపణలను ఖండించారు.