కట్నరాక్షసుడు.. భార్య కిడ్నీ అమ్మేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

కట్నరాక్షసుడు.. భార్య కిడ్నీ అమ్మేశాడు

February 8, 2018

కట్నం ఇవ్వట్లేదని కట్టుకున్న భార్య కిడ్నీని అమ్ముకున్నాడో రాక్షస భర్త. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.  కడుపునొప్పి రావటంతో బాధితురాలు ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్లు ఆమెకు స్కాన్ చేయగా ఆమె ఒంట్లో కుడివైపు కిడ్నీ లేదని చెప్పటంతో షాక్‌కు గురైంది. ఇది తన భర్త పనేనని చెప్పిందామె.

బాధితురాలు రీటా సర్కార్‌కు రెండేళ్ల క్రితం తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దాంతో ఆమెను హాస్పటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఆమెకు అపెండిక్స్ సర్జరీ చేశారు. 2017లో మళ్లీ ఆమెకు కడుపునొప్పి తిరగదోడటంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. స్కాన్ చేసిన డాక్టర్లు ఆమెకు ఒక కిడ్నీ లేదని ధ్రువీకరించారు.

ఇదంతా తన భర్త పనేనని రీటా ఆరోపించింది.   కొన్నేళ్లుగా కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, ఆపరేషన్ పేరుతో రెండేళ్ల క్రితం కోల్‌కతాలో ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించాడని పేర్కొంది. అయితే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడని, అతనే కిడ్నీని అమ్మేసుంటాడని తెలిపింది.  తనను చాలా ఏళ్లుగా గృహహింసకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అవయవాల అక్రమ రవాణా కింద కేసును బుక్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.