ఏంటిది నెలకు 1.5 కోట్లా..అబ్బా డీఎస్పీ ఉద్యోగంకు అంత జీతముంటదా, సార్ ఓవర్ టైం డ్యూటీ చేసి సంపాయించిండా ఏంది అని అనుకుంటున్నారా? ఓవర్ టైం కాదు ఓవర్ యాక్షన్ జేసి సంపాయించిన పైస. అచ్చే జీతం వేలల్లో ఉంటే..లంచాల దీస్కున్న పైసలు కోట్లల్ల ఉన్నయ్. తమిళనాడు లోని వేలూరు జిల్లా ఆంబూరు డీఎస్పీ ధన్రాజ్ మొన్ననే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారి దగ్గరనుంచి 1.45 లక్షల లంచం తీసుకుంటూ విజిలెన్స్ ఆఫీసర్లకు దొర్కిపోయిండు. ఇక ఈ ఉత్తమ పోలీస్ గురించి ఆరా తీస్తే మొత్తం ఆదాయం బైటవడ్డది.సారా కాయాలంటే లంచం, ఇసుక రవాణా చేయాలంటే లంచం..ఎస్ఐ కాన్నుంచి కానిస్టేబుల్ దాక అన్ని స్టేషన్లున్న పోలీసోళ్లు ఈ పెద్దసారుకు నెల నెలా మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. మామూళ్లు అన్ని జమజేస్తే నెలకు కోటీ యాభై లక్షలకు మీదనే వస్తయట. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కూడ వెట్టుంటడో సారు. సారు అరెస్ట్ అయ్యిండు అని తెల్వంగనే..మామూళ్ల పీడ విర్గడైపోయిందని వేలూరు పబ్లిక్ కొన్ని పోలీస్స్టేషన్ల ముందు సంబురంగా బాణాసంచా కాలుస్తూ..ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నరు. మరి చేసుకోకపోతే ఏం జేస్తరు. మామూళ్లు ఇయ్యకపోతే ఆ డీఎస్పీ సారు అడ్డమైన కేసులు వెట్టి లోపటేస్తుండెనట. తిన్నది ఒంటికి పట్టకుంట దమ్కీల మీద దమ్కీలు ఇస్తుండెనట. ఇగ అరెస్టైన డీఎస్పీ సార్ను కోర్టులో హాజరు పరిచి వేలూరు సెంట్రల్ జైలుకు 15 రోజుల పాటు రిమాండ్కు పంపిన్రు పోలీసోళ్లు.