దండుపాళ్యం సినిమా చూసి.. పక్కాగా హత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

దండుపాళ్యం సినిమా చూసి.. పక్కాగా హత్య..

January 31, 2018

‘దండుపాళ్యం’ సినిమాను ఆదర్శంగా తీసుకొని విశాఖలో కొంతమంది నేరగాళ్లు ముఠాగా ఏర్పడి పలు నేరాలకు పాల్పడుతున్నారు. సోమవారం రాత్రి  విశాఖ జిల్లా పెందుర్తి దగ్గర ఒక మారుమూల ప్రాంతంలో మద్యం తాగుతున్న కొంత మంది ఆకతాయిలను గస్తీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. యోగా టీచర్ పి. వెంకటరమణ హత్య కేసులో ఇద్దరు నిందితులు ఆ ముఠాలో వుండటంతో వారి నుంచి సమాచారం రాబట్టారు.  మిగతా నిందితుల్నీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యకేసులో అనిల్, అజయ్ కుమార్, కల్యాణ్, పవన్‌తో పాటు మరికొందరు వున్నట్టుగా సమాచారం. నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో పెట్టి విచారిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడు కిలపర్తి వెంకటరమణ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

దండుపాళ్యం బ్యాచ్‌గా ఏర్పడి

బర్మాకేంప్‌, చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువకులు దండుపాళ్యం బ్యాచ్‌గా ఏర్పడ్డారు.  సుపారీలు తీసుకొని బెదిరింపులు, చిన్న నేరాల నుంచి హత్యలకు వరకు పాల్పడుతున్నారని తేలింది. మద్యం దుకాణాల వద్ద వృద్ధుల్ని కొట్టి డబ్బులు లాక్కోవడం వంటివి చేసేవారు. ఆపై పెద్ద నేరాలు చేయడం ప్రారంభించారు. ఆరుగురికీ గతంలో నేర చరిత్ర వున్నది. అజయ్ కుమార్‌కు చిన్నప్పట్నించీ నేర చరిత్ర  ఉంది.  బాల నేరస్తుడిగా శిక్షణ కేంద్రంలో కొంతకాలం వున్నాడు. కట్టుకున్న భార్యను కూడా హత్య చేశాడు. మరో నిందితుడు కూడా ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్నాడు.

మిగతా నలుగురు కూడా పలు కేసుల్లో నిందితులుగా వున్నారు. యోగా టీచర్ హత్య కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. జనగోల పత్రిక ఎడిటర్ కె. వెంకట రమణ వీరికి సుపారీ ఇచ్చి యోగా టీచర్ పి. వెంకటరమణను హత్య చేయించాడు.యోగా టీచరైన తన కొడుకుకు పోటీ రాకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు రమణ.