గుడ్డు పెట్టిన కోడిపుంజు - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్డు పెట్టిన కోడిపుంజు

April 21, 2018

గాడిద గుడ్డు పెడుతుందో లేదో తెలియదు గానీ ‘గాడిద గుడ్డు గాడిద గుడ్డు’ అని ఇప్పటికి ఆ వాక్యాన్ని వెటకారంగా  చాలామంది అనుంటారు. గాడిద గుడ్డు పెడుతుందా అని కొందరికి అనుమానం వుండొచ్చు కానీ కోడిపుంజు మాత్రం గుడ్డు పెట్టి చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కోడిపుంజు కొకొరొకో అని కూస్తుంది గానీ గుడ్డు పెట్టడం అనేది జరగదు అనుకోవచ్చు. కానీ గుడ్డు పెట్టింది. ఈ వార్త తెలిసి ఇకనుంచి ‘కోడుపుంజు గుడ్డేం కాదు’ అంటారేమో. ప్రకృతికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం, వి. వెంకటాయపాలెం గ్రామంలో కోడిపుంజు గుడ్డు పెట్టి చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వెంకటాయపాలానికి చెందిన ఆలస్యం శ్రీనివాసరావు ఇంట్లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.గత నెలలో పుంజు ఒక గుడ్డు పెట్టిందట. అది చూసిన శ్రీనివాసరావుకు అనుమానం వచ్చిందట. ఎహ పుంజు ఎలా గుడ్డు పెడుతుందిలే.. కోడిపెట్టే పెట్టుంటుంది అనుకున్నాడట. తర్వాత చిన్నగా తోలుగుడ్డు పెట్టిందట. ఈసారి అనుమానం కలిగి దాన్ని వేరేగా కమ్మి చూశాడట. ఆశ్చర్యంగా గంపకింద అది గుడ్డు పెట్టేసరికి తన అనుమానం నిజమైంది అంటున్నాడు యజమాని. ఆ పుంజును చూడటానికి ఊరి జనాలే కాదు చుట్టుపక్కల జనాలు కూడా వచ్చి చూస్తున్నారట. జన్యు పరివర్తనాల వల్ల ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని పశువైద్యాధికారి డాక్టర్‌ కె.కిషోర్‌ తెలిపారు. కోడిపుంజు పెట్టే గుడ్డును విండ్‌ గుడ్డు అంటారని చెప్పారు. తోలుగుడ్డును పుల్లెట్ గుడ్డు అంటారని.. ఇలా పెట్టే గుడ్డులో పచ్చసొన ఉండదని, ఇవి పునరుత్పత్తికి పనికిరావని డాక్టర్ తెలిపారు.