కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే చదవండి - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే చదవండి

November 22, 2017

మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే కొద్ది కాలం ఆగండి. అతిత్వరలో ఇండియన్ రోడ్లపైకి ఎలక్ట్రిక్ కారులు రాబోతున్నాయి. 2030 నాటికి దేశం మొత్తం ఎలక్ట్రిక్ కార్లతో నింపాలనే లక్ష్యాన్ని మన ప్రభుత్వం పెట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చే సంవత్సరం నుంచి, మనదేశంలోకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని యోచిస్తోంది.

దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తైంది. పెట్రోల్, డీజిల్ స్టేషన్ల తరహాలోనే, ఎలక్ట్రిక్ కార్లకు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ రూపొందినట్టు తెలుస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా(M&M) కంపెనీ  ఇప్పటికే మనదేశంలో ఎలక్ట్రిక్ కార్లను నామ మాత్రంగా అమ్ముతోంది. అయితే ప్రభుత్వం స్వయంగా వివిధ కంపెనీలకు 10 వేల ఎలక్ట్రిక్ కార్లు కావాలని ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. మొదటి దశలో టాటా మోటార్స్ 250 ఎలక్ట్రికల్ కార్లను, ఎం&ఎం కంపెనీ 150 కార్లను ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాయి.

అయితే ఎలక్ట్రిక్ కార్లను రోడ్లపైకి తేవడమనేది పెద్ద పని కాదు. కానీ  కార్ల చార్జింగ్ కోసం కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడమనేది పెద్ద చాలెంజ్. దీనికోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మనదేశంలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యింది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుంది.

జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ, సుజికీ మోటార్, టయోటా మోటార్ మనదేశంలో ఎలక్ట్రిక్ కార్లను అమ్మడానికి ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందం రాబోయే మూడు సంవత్సరాల కోసం అని తెలుస్తోంది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకుంది.

ఇందుకోసం కావాల్సిన బ్యాటరీ, భారత రోడ్లకు సరిపడా ఇంజన్ తయారీలో హోండా కార్స్ నిమగ్నమై ఉంది. అయితే 2030 నాటికి దేశంలో 65శాతం ప్రజలు ఎలక్ట్రిక్ కార్లు వాడుతారనేది హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అంచనా వేస్తోంది. అందుకే కొత్త కార్లను కొనాలనుకునే వారు కొంత కాలం ఆగి కొత్త ఎలక్ట్రిక్ కార్లను కొనుక్కోండి.