నక్కపిల్లను పెంచుకుంటోంది.. అదృష్టం కోసమట - MicTv.in - Telugu News
mictv telugu

నక్కపిల్లను పెంచుకుంటోంది.. అదృష్టం కోసమట

April 12, 2018

పొద్దున లేవగానే నక్కతోక తొక్కితే అదృష్టం వచ్చి కౌగిలించుకుంటుంది అంటారు పెద్ద మనుషులు. నక్క ముఖం చూసినా చాలా మంచిది అంటారు. కానీ నక్క వూళ్ళల్లో తప్పిచ్చి నగరాల్లో ఎక్కడ కనిపిస్తుంది అనేది డాలర్ల క్వశ్చన్ ? వూళ్ళల్లో కూడా ఎక్కడో పొలిమేరల్లో రాత్రుళ్ళు ఊళలు వేయటం అప్పుడప్పుడు వింటుంటాం. ఈ విషయం పక్కన పెడితే నక్క ముఖం చూస్తే మంచిదని చెప్పగా విన్న ఓ మహిళ ఏకంగా నక్క పిల్లనే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని సాదుకుంటోంది.నెలమంగల తాలూకా మస్కూరు గ్రామంలో ఓ చిన్నకారు రైతు మహిళ నక్కపిల్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది. ప్రతిరోజూ దానికి పాలు, బువ్వ పెట్టి ఇంట్లో పెంచుకుంటోంది. కిస్‌మత్‌ను లాక్కొచ్చి ఒళ్ళో కూర్చుండబెట్టే నక్క తన ఇంట్లో వుందంటే ఏదో ఒకరోజు తాను కోటీశ్వరురాలు అయిపోతానని కలలు కన్నట్టుంది. కానీ ఈ విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు ఆమె ఇంటిపై దాడిచేసి నక్కను స్వాధీనం చేసుకున్నారు.  తన పొలం వద్ద ఈ నక్కపిల్ల దొరికిందని.. అదృష్టం వరిస్తుందని పెంచుకుంటున్నాను తప్పితే వేరే ఉద్దేశం లేదని చెప్పింది. దీంతో అధికారులు ఆమె మీద కేసు నమోదు చేయకుండా వదిలేశారు. నక్కపిల్లను బన్నేరుఘట్ట నేషనల్‌ పార్కుకు తరలించారు అటవీశాఖ అధికారులు.