నోబెల్ గ్రహీత.. నడిరోడ్డుపై సాయం కోసం అర్థిస్తూ.. - MicTv.in - Telugu News
mictv telugu

నోబెల్ గ్రహీత.. నడిరోడ్డుపై సాయం కోసం అర్థిస్తూ..

March 15, 2018

ఎవరి పరిస్థితి ఎప్పుడు, ఎలా వుంటుందో వూహించటం కష్టం. అందరూ వుండి కూడా దిక్కులేని దుస్థితికి రావచ్చు. అలాంటి విపత్కర పరిస్థితులను ప్రముఖ శాస్త్రవేత్త ఐయిచి నెగిషి ఎదుర్కున్నారు. ప్రఖ్యాత నోబెల్ పురస్కారం పొందిన శాస్త్రవేత్తగా ఆయన ఆ ప్రపంచానికి సుపరిచితులే. 82 వయసున్న నెగిషి కారు ప్రమాదానికి గురై సాయం కోసం రోడ్డుపై అటూ ఇటూ తిరిగారు. నెగిషి 2010లో రసాయన శాస్త్రంలో మరో ఇద్దరితో కలిసి నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్నారు.  జపాన్‌కు  చెందిన నెగిషి 1960లో స్కాలర్‌షిప్‌పై అమెరికాకు వచ్చారు.ప్రస్తుతం ఆయన అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ఉంటున్నారు. సోమవారం ఇంటి నుంచి కారులో బయలుదేరిన నెగిషి దంపతులు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య సుమైర్‌ నెగిషి(80) ప్రాణాలు కోల్పోగా ఆయన గాయాలపాలయ్యారు. ఇంటినుంచి వెళ్లినవాళ్ళు కనిపించకుండా పోయేసరికి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గాలింపు చేపట్టారు.  మంగళవారం ఓ అడ్వాన్స్‌డ్‌ డిస్పోజల్‌ కంపెనీకి చెందిన ప్రదేశంలో, ఇంటి నుంచి దాదాపు 320కిలోమీటర్ల దూరంలో ఐయిచిని గుర్తించారు. కారు అదుపుతప్పటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో కుట్ర ఏమీ లేదని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  వారు వెళ్లాలనుకున్న రాక్‌ఫోర్డ్‌ విమానాశ్రయానికి 13 కిలోమీటర్ల దూరంలో ఓ గుంత వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఐయిచి భార్య కారు వద్ద చనిపోయివుంది. వృద్ధుడైన ఆయన గాయాలతో సహాయం కోసం అర్థిస్తూ రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ పోలీసులు కంట పడ్డారు. దీంతో పోలీసులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.  ప్రస్తుతం నెగిషి ఇండియానాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.