రాజస్తాన్‌ కాంగ్రెస్‌కు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ బీజేపీకి.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్న కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలకు మోదాన్నీ, ఖేదాన్నీ కలిగిస్తున్నాయి. బీజేపీ పాలనలోని రాజస్తాన్ ఈసారి హస్తానికి దక్కుతుందని, కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు వస్తాయని పలు సర్వేలు అంచనా వేశాయి. మధ్యప్రదేశ్‌ను బీజేపీ తిరిగి నిలబెట్టుకుంటుందని, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ అతికష్టమ్మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తేడా కొడితే కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందని అంటున్నాయి. మూడో ప్రధాన పార్టీగా భావించిన బీఎస్పీ ఛత్తీస్‌గఢ్‌లో కింగ్ మేకర్‌గా మారొచ్చని  చెబుతున్నాయి.

రాజస్తాన్‌లో

200 స్థానాలున్న రాజస్తాన్‌లో కాంగ్రెస్ కూటమికి 119 నుంచి 141 రావొచ్చని ఇండియా టుడే సర్వే పేర్కొంది. బీజేపీ 55 నుంచి 72 సీట్లతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. రాష్ట్రంలో హస్తానికి 105, బీజేపీకి 85 వస్తాయని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం.. బీజేపీకి 81 నుంచి 103 వరకు, కాంగ్రెస్‌కు 81 నుంచి 101 దక్కొచ్చు.

మధ్యప్రదేశ్‌లో

230 సీట్లున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 126, కాంగ్రెస్‌కు 89 రావొచ్చని టైమ్స్ నౌ అంచనా వేసింది. కమలనాథులకు 102 నుంచి 120 వరకు రావొచ్చని, కాంగ్రెస్ 37కు మాత్రమే పరిమితమవుతుందని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది.

ఛత్తీస్‌గఢ్..

90 సీట్లున్న ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. బీజేపీ కాంగ్రెస్‌పై అతి స్వల్ప ఆధిక్యం మాత్రమే కనబరుస్తోంది. కొన్ని ఎగ్జిట్ పోల్సయితే కాంగ్రెస్‌కు ఆధిక్యం కట్టబెట్టాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి  42 నుంచి 50. కాంగ్రెస్ పార్టీకి 32 నుంచి 38 వరకు, బీఎస్పీకి, 6 నుంచి 8 రావొచ్చు. బీజేపీకి 38 నుంచి 42, కాంగ్రెస్‌కు 44 వరకు రావొచ్చని న్యూస్ నేషన్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 42 నుంచి 50 వరకు, బీజేపీకి 35 నుంచి 42 రావొచ్చని సీఓటర్ సర్వే అంచనా. తక్కువ సీట్లు వచ్చినా ఇతర పార్టీలతో కలసి కాంగ్రెసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఇక 40 సీట్లున్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంను కాంగ్రెస్ చేతి నుంచి కమలం లాక్కుటుందని పలు సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి 16 నుంచి 20, కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 18, జెడ్పీఎంకు 3 నుంచి 7 వరకు రావొచ్చని సీఓటర్సర్వే తెలిపింది.

Telugu news, exit poll results, assembly elections, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Mizoram