ఫేస్‌బుక్, వాట్సాప్‌కు బానిసైన భార్యను చంపిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్, వాట్సాప్‌కు బానిసైన భార్యను చంపిన భర్త

April 17, 2018

ఓ భర్త కట్టుకున్న భార్యను రాత్రి పడుకున్న సమయంలో అతి కిరాతకంగా గొంతు నులిమి చంపేశాడు. కారణం ఆమె ఎప్పుడు చూసినా  సోషల్ మీడియాలోనే వుండి, తనను పిల్లలను నిర్లక్ష్యం చేస్తోందని ఈ హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు అతడు. ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోగల సెక్టార్ 92లోని సారే హోమ్స్‌లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నిందితుడు హరిఓమ్ సింగ్‌కు(32) 2006లో లక్ష్మీతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. పెళ్ళయ్యాక వారి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా బాగానే సాగింది. ఎప్పుడైతే భార్యకు హరి ఓం స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడో అప్పటి నుంచి వారి కాపురంలో చిచ్చు మొదలైంది.స్మార్ట్‌ఫోన్‌కు లక్ష్మీ బాగా బానిస అయిపోయింది. నిత్యం ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఎక్కువ టైంపాస్ చేసేది. తొలుత ఇలాగే వుంటుంది.. తర్వాత తర్వాత తనే వాటి మీద విసుగు చెందుతుందని అనుకున్నాడట హరిఓం. కానీ లక్ష్మీ నానాటికీ సోషల్ మీడియా మీద మోజు తగ్గించుకుపోగా బానిసలా మారిపోయిందట.

రాత్రింబవళ్ళు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో చాటింగ్‌లు చేస్తుండటం భర్త గమనించాడు. ఈ క్రమంలో లక్ష్మీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. సమయానికి వండటం, పిల్లలను స్కూలుకు రెడీ చేయటం వంటివి పట్టించుకోకుండా ఫోన్‌లోనేవుండేది.

భర్త, పిల్లలను పూర్తి నిర్లక్ష్యంగా చూడసాగింది. దీంతో భార్య ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్నాడు హరిఓం. భార్యను తన ప్రవర్తన మార్చుకోవాలని హరిఓం చాలా సార్లు చెప్పాడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఎవరితోనో తన భార్య వ్యవహారం నడుపుతోందని హరిఓం అనుమానం పెంచుకున్నాడు. ఓరోజు ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. దీనికింతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాడు భర్త. గురువారం రాత్రి ఆమె నిద్రపోతున్న సమయంలో గొంతు నులిమి హత్య చేశానని హరిఓం పోలీసుల ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తన భార్య వ్యవహారం నచ్చకే ఈ హత్య చేసినట్టు హరిఓం తెలిపాడు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.