సిగరెట్.. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన  షార్ట్‌ఫిల్మ్ - MicTv.in - Telugu News
mictv telugu

సిగరెట్.. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన  షార్ట్‌ఫిల్మ్

April 6, 2018

సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెప్పినా వినేదెవరు ? అసలు సిగరెట్లు తాగటం ఎలా నేర్చుకుంటున్నారు ? అనే ప్రశ్నకు 100 లో 64 శాతం కుటుంబ సభ్యుల నుంచే నేర్చుకుంటున్నారని సమాధానం.  మిగతా 36 శాతం సమాజం నుంచి నేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మైక్ టీవి ‘సిగరెట్’ అనే షార్ట్‌ఫిల్మ్ రూపొందించింది.

ఇంట్లో కన్నతండ్రి సిగరెట్లు తాగటం వల్ల ఆ ప్రభావం పిల్లల మీద కచ్చితంగా పడుతుంది అని చూపించే ప్రయత్నం చేసింది. పిల్లాడు చిన్నవాడు వాడికేం తెలియదు అనుకుంటారు చాలా మంది కన్నవాళ్ళు. కానీ పిల్లలు తల్లిదండ్రులు ఏది చేస్తే అది చేస్తుంటారు. ఆ క్రమంలో తండ్రికి సిగరెట్, గుట్కాలు నమిలే అలవాటుంటే అది ఆటోమెటిగ్గా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది.

పిల్లవాడు సిగరెట్ తాగాడని అతణ్ణి దోషిని చేసి నిందించాల్సిన అవసరం లేదు. అతను అలా సిగరెట్‌పై ఆకర్షితుడవటానికి ప్రేరేపించింది ఎవరని కుటుంబ సభ్యులు తమను తాము తరచి చూసుకోవాల్సిన అవసరం వుందని ఈ షార్ట్‌ఫిల్మ్ చెబుతుంది. మన భయం లేక పిల్లలు చెడిపోతున్నారనే అనుకుంటారు  తల్లిదండ్రులు. కానీ మన ప్రవర్తన బాగలేక చెడిపోతున్నారని అనుకోరు. ఇప్పటివరకు చాలా మంది స్మోకింగ్‌కు అలవాటు పడటానికి మొదటి అడుగు కుటుంబాల నుంచే పడిందనేది ఎవరూ కాదనని సత్యం. ఆలోచిస్తే మనమే మన పిల్లలను పాడు చేస్తున్నామనే స్ఫురణ వస్తుంది. ఆ దిశలో ఆలోచించేలా చేస్తుంది ఈ పొట్టి సినిమా. మన దుర్వ్యసనాలు పిల్లలకు అలవడకుండా జాగ్రత్త పడదాం. పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దాలంటే మంచి కార్పోరేట్ చదువు అక్ఖర్లేదు.. తల్లిదండ్రులు ఎలాంటి వ్యసనపరులు గాకుండా వుంటే అదే పదివేలు. ఈ చిన్న సినిమా చూసి మైక్ టీవీ ప్రయత్నం ఎలా వుందో చెప్పండి.