mictv telugu

అజిత్‌పై పైశాచిక అభిమానం.. తండ్రిని కాల్చేశాడు..

January 10, 2019

సినిమా స్టార్లపై  అభిమానం అమ్మానాన్నల ప్రేమను కాలరాస్తోందా? సినీబంధాలు భవబంధాలను తుంచేస్తున్నాయా?  తను అభిమానించే హీరో సినిమా చూడటానికి డబ్బులివ్వని తండ్రిపై ఓ కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది ఈ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరో అజిత్‌కు వేలూరుకు చెందిన అజిత్‌కుమార్‌ అనే యువకుడు వీరాభిమాని. అభిమాన నటుడి సినిమాను మొదటిరోజే చూడటం అతనికి అలవాటు. ఈ క్రమంలో గురువారం అజిత్ ‘విశ్వాసం’ సినిమా విడుదలైంది.

ఎలాగైనా తన అభిమాన హీరో సినిమాను మొదటిరోజు, మొదటి షో చూడాలనుకున్నాడు. కానీ తన దగ్గర డబ్బులు లేవు. దీంతో నాన్న పాండియరాజన్‌  దగ్గర డబ్బులు కావాలని అడిగాడు. అందుకు ఆయన తనదగ్గర లేవన్నాడు. ఎలాగైనా కావాలని మొండికేశాడు. లేనివి ఎక్కణ్ణుంచి తెచ్చివ్వాలని అన్నాడు తండ్రి. దీంతో విచక్షణ కోల్పోయిన అజిత్ తండ్రి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడానికి ప్రయత్నించాడు.  ఈ ఘటనలో తండ్రి ముఖం కాలింది. స్థానికుల సహాయంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అజిత్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. ఇదిలావుండగా మరో ఘటనలో మాహీరో తోపు అంటే మాహీరో అనుకుంటూ కత్తులు దువ్వుకున్నారు అభిమానులు.

Telugu news Fans with attacks with knives Petrol over another fan father .

కత్తులతో దాడులు…

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఒకేరోజు ఇద్దరు పెద్ద హీరోలు రజనీకాంత్, అజిత్‌లు నటించిన సినిమాలు (పేట, విశ్వాసం) విడుదలయ్యాయి. పలు థియేటర్ల వద్ద అభిమానులు తమ అభిమాన నటుడి సినిమా పాటలకు డాన్సులు చేస్తూ హంగామా సృష్టించారు. అజిత్ అభిమానులు నాలుకపై కర్పూరం వెలిగించుకుని హారతులు పట్టారు. విడుదలైన రెండు సినిమాలకు పాజిటివ్ టాకే వచ్చింది. అయినా అభిమానులు మా హీరో గొప్పోడంటే.. మాహీరో గొప్పోడని గొడవలు పెట్టుకున్నారు. దీంతో తమిళనాడులోని పలు థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు హీరోల అభిమానులు ఘర్షణలకు దిగడంతో సరిపెట్టుకోకుండా భౌతికాదాడులకు పాల్పడ్డారు.

పలు చోట్ల ఫ్యాన్స్‌ ఘర్షణలకు దిగటంతో పరిస్థితి చేయిదాటిపోయింది. వేలూరులోని ఓ థియేటర్ ముందు ఇరువర్గాల వాళ్లు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా వుందని సమాచారం.

Telugu news Fans with attacks with knives.. Petrol over another fan father