వ్యవసాయంలో గిట్టుబాటు లేక రైతుల ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

వ్యవసాయంలో గిట్టుబాటు లేక రైతుల ఆత్మహత్య

March 30, 2018

ప్రపంచంలో అన్నీ రంగాలు అభివృద్ధి చెందుతున్నా వ్యవసాయం రంగం మాత్రం అభివృద్ధి చెందటం లేదు. దాన్ని నమ్ముకున్న రైతుల గోసలు కూడా ఆగటం లేవు. ప్రభుత్వాలు ఎన్ని వాగ్దానాలు చేసినా అవి వాళ్ల వరకు చేరటం లేవు. అప్పుల బాధలకు తాళలేక ఇప్పటికి ఎందరో రైతులు అసువులుబాసారు. తాజాగా జనగామ మండలం సిద్దెంకి గ్రామంలో ఆవుల నర్సిరెడ్డి, అతని భార్య చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఎందరినో కలిచివేసింది ఈ ఘటన. నమ్ముకున్న వ్యవసాయంలో గిట్టుబాటు లేకపోవటం ఒకవైపు, చేసిన అప్పులకు వడ్డీలకు వడ్డీలు పెరగటం మరోవైపు ఆ దంపతులను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి.‘ మట్టిని నమ్ముకొని ఇంత క్షోభ అనుభవించాలా నేలతల్లీ.. మాకొద్దు ఈ దగాపడ్డ బతుకులు.. మమ్మల్ని శాశ్వతంగా నీ ఒడిలోకి తీసుకో.. మమ్మల్ని ఎవరూ ఉద్ధరించరు.. మా బతుకులింతే.. ’ అని తీవ్ర ఆవేదనకు లోనయినట్టున్నారు. ఇద్దరు కూతుళ్ళు వుండగా వాళ్ళ వివాహాలు చేసి ఇద్దరే వుంటున్నారు. కూతుళ్ల పెళ్లిళ్ళకు, వ్యవసాయానికి లాగోడికి చేసిన అప్పులు ఉక్కిరిబిక్కిరి చేయటంతో ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.