రేపటి నుంచి థియేటర్లు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

రేపటి నుంచి థియేటర్లు బంద్

March 1, 2018

సౌత్ ఇండియా థియేటర్లలో సినిమాల ప్రదర్శనను మార్చి 2న నుంచి నిలిపివేస్తున్నట్టు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ కమిటీ ఛైర్మన్ దామోదర ప్రసాద్ తెలిపారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ ముత్యాల రాందాస్‌తో కలిసి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ డిజిటల్‌ ప్రొవైడర్లతో మూడు సార్లు(హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరులో) సమావేశం అయ్యాం. వీపీఎఫ్‌(వర్చువల్‌ ప్రింట్‌ ఫీస్‌) చార్జీలను రద్దు చేయాలని, థియేటర్లలో మూడు ట్రైలర్లను ప్రదర్శించుకునే వెసులుబాటు మాకు కల్పించాలని, వాణిజ్య ప్రకటనల నిడివిని ఎనిమిది నిమిషాలకు కుదించాలని డిమాండ్‌ చేశాం. వాస్తవానికి డిజిటల్‌ విధానం మొదలైన ఐదేళ్లకే వీపీఎఫ్‌లు రద్దు కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఆ పద్ధతే నడుస్తోంది. ఆంగ్ల చిత్రాలను ఇక్కడ ప్రదర్శించే సందర్భాల్లోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నారని’ ఆయన తెలిపారు.మన కంటే బాలీవుడ్‌లో తక్కువ వీపీఎఫ్ చార్జీలు వసూలు చేస్తున్నారని,  కానీ మన దగ్గర ఇంకా పాత పద్ధతి పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.‘మార్చి2 నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తాం’ అని చెప్పారు. ముత్యాల రాందాస్‌ మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి డిజిటల్‌ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పొరుగు రాష్ట్రాల వారు కూడా ఇదే విషయంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.