ఫింఛన్ ఇచ్చి.. అవ్వకి బువ్వ పెట్టిన కలెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫింఛన్ ఇచ్చి.. అవ్వకి బువ్వ పెట్టిన కలెక్టర్

April 5, 2018

అయినవాళ్ళనే పట్టించుకోని రోజులు దాపురించాయి. కన్నవాళ్ళను కూడా పట్టించుకోకుండా ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్న అమానవీయ రోజుల్లో వుంది వ్యవస్థ. రోజురోజుకు మానవత్వం అంతరించిపోతుంటే.. లేదు లేదు.. వుంది.. నాలో వుంది.. నీలో వుంది.. ఒక్కసారి తడిమి చూడండి.. అప్పుడు జగమంత కుటుంబం మనదే అవుతుంది.. మనుషులమందరం ఒక్కటవుతాం.. అని చెప్పకనే చెప్తున్నాడు ఈ కలెక్టర్. చదువుతో పాటు సంస్కారం వుండాలంటారు. అది ఈ కలెక్టర్‌కి ఆయన ఎదిగినా ఆయన మస్తిష్కం నుంచి మాసిపోలేదు. ఏ దిక్కులేని అవ్వకు ఆమె ఇంటికి వెళ్ళి ప్రభుత్వ ఫించన్ అందించాడు. కొడుకుగా ఆమెకు అన్నం తినిపించాడు. ఎందరిలోనో ఆదమరిచి నిద్రపోతున్న మానవత్వాన్ని తట్టిలేపిన ఈ ఘటన తమిళనాడులో జరిగింది.కరూర్ జిల్లా చిన్నమనాయకన్ పట్టికి చెందిన రాఘమ్మాళ్ వయస్సు 80 ఏళ్లు. ఆ అవ్వకు ఎవ్వరూ తోడు లేరు. ఒంటరిగా జీవితం గడుపుతోంది. ఎలాగున్నావ్ అని పలకరించేవాళ్లు లేకపోయినా గుండె ధైర్యంతో ఒంటరిగా కాలం వెళ్లదీస్తోంది. ప్రభుత్వం ప్రతినెలా వృద్ధాప్య ఫింఛన్ ఇస్తోంది. అయితే వారం రోజులుగా విపరీతమైన ఎండలతో బయటకు వెళ్లలేకపోతోంది. కొన్ని రోజులుగా ఆరోగ్యం సహకరించక పింఛను తీసుకోవడానికి వెళ్లలేకపోయింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ అన్ బజగాన్ స్పందించారు. ఆ అవ్వకు నేనున్నానని భరోసా ఇచ్చారు. అంతేకాదు  ఏప్రిల్ 3వ తేదీ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టాడు. తను ఇంటి నుంచి తీసుకెళ్లిన భోజనంను ఆమెకు కూడా వడ్డించారు. అరటి ఆకులో వేసి.. అందులో అవ్వకి కూడా బువ్వ పెట్టారు. ఆ అవ్వకు తనే స్వయంగా తినిపించారు. ఏ కష్టం వచ్చినా నా దగ్గరకి వచ్చేయండి అంటూ అవ్వకి భరోసా ఇచ్చారు. కలెక్టర్ సహృదయత చాలామందిని కదిలించింది.