విశాల్ పోటీపై కోలీవుడ్‌లో రగడ - MicTv.in - Telugu News
mictv telugu

విశాల్ పోటీపై కోలీవుడ్‌లో రగడ

December 5, 2017

హీరో విశాల్‌కు అప్పుడే వ్యతిరేక నినాదాలు ఎదురవుతున్నాయి. విశాల్ రాజకీయ రంగ ప్రవేశం సినిమా భవిష్యత్తుకు సెగ తగిలేలా వున్నది.  ప్రస్తుతం విశాల్ చెన్నై నిర్మాతల మండలికి అధ్యక్షుడు కాగా ఆ పదవికి వెంటనే రాజీనామా చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ నిర్మాతల మండలికి లేఖ రాశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

విశాల్ చర్యలు సముచితం కావు :

‘ విశాల్ తొలుత దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో గెలవటానికి డీఎంకే నేత కరుణానిధి ఆశీస్సులు తీసుకున్నాడు. ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత సమాధులకు నివాళులు అర్పించి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అతని చర్యలు సముచితంగా లేవు. అతని చర్యలకు నడిరోడ్డున పడేది నిర్మాతలే. విశాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అతని తీరు వల్ల ఇకపై నిర్మాతలకు పార్టీ, ప్రభుత్వాల నుంచి సహాయం అందదు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్‌ నిర్మాతలకు మేలు చేసిందేమీ లేదు’ అని  చేరన్  అరోపించారు. 

రాజకీయ లబ్ది కోసమే విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఘాటుగా విమర్శించారు. నిజంగా నిర్మాతల శ్రేయస్సు కోరితే వెంటనే నిర్మాతల మండలి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

లేని పక్షంలో ఆర్కేనగర్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన సాయంత్రం నుంచే విశాల్‌కు వ్యతిరేకంగా నిర్మాతలందరం కలిసి పోరాటం చేస్తామని లేఖలో హెచ్చరించారు. అనంతరం లేఖను నిర్మాతల మండలిలో సమర్పించారు. కాగా ఈ విషయమై విశాల్ నుండి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.