మధుర మీనాక్షి ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్టు మధురై కలెక్టర్ వీరరాఘవరావు అంచనా వేస్తున్నారు. ఆలయ తూర్పు రాజగోపురం సమీపంలోని వేయీళ్ల మండపం వద్ద శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలోని 50 దుకాణాల వరకు మంటల్లో కాలిపోయాయి. పదుల సంఖ్యలో ఫైర్మన్లు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.
ఆ సమయంలో ఆలయ సిబ్బంది, భక్తులు ఆలయంలో లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందంటున్నారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అగ్నిప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామని కలెక్టర్ చెప్పారు.