ప్రపంచంలోనే తొలి మడత స్మార్ట్ ఫోన్

మీ స్మార్ట్‌ఫోన్ పరిమాణం పెద్దదిగా ఉందని బాధపడుతున్నారా? పెద్ద ఫోన్ వాడాలని ఉన్నా… పెద్ద ఫోన్ ద్వారా కలిగే ప్రయోజనాలను పొందాలని ఉన్నా దానిని క్యారీ చేయడం కష్టం అని ఇష్టాన్ని చంపుకుంటున్నారా? ఇకపై మీ బాధలు తీరినట్టే… ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డ్ చేసే ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది.

ఎన్నో వినూత్న ఆవిష్కరణలకు కేంద్రబిందువైన చైనాలోనే ఈ మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. చైనాకు చెందిన రాయ్‌లీ కార్పొరేషన్‌ అనే సంస్థ ఈ మొబైల్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ తరహా ఫోన్‌ దిగ్గజ ఫోన్ తయారీ సంస్థలైన శాంసంగ్‌, ఎల్‌జీ, హువాయ్‌‌ల వద్ద ఇంకా అభివృద్ధి దశలోనే ఉండగా… చైనా సంస్థ రాయ్‌లీ.. ‘ఫ్లెక్సీ పై’ పేరుతో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

ఇప్పటికే తాము తయారు చేసిన ఫోన్‌ను రెండు లక్షల సార్లు మడతబెట్టి పరీక్షించామని, కాబట్టి ఫోన్‌ తెరపై దృశ్యం ఏళ్ల పాటు ఏ అవాంతరం లేకుండా కనిపిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఫోన్‌ను 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 8జీబీ+జీబీ వేరియంట్లలో విడుదల చేశారు.రాయ్‌లీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… ఫోన్ ముందు భాగంలో రెండు కెమెరాలు (16ఎంపీ+20ఎంపీ) ఉన్నాయి. ఇది ఫోన్‌ను మడతబెట్టినప్పుడు వెనుక కెమెరాగా, మామూలుగా ఉంచినప్పడు ఫ్రంట్‌ కెమెరాగా పనిచేస్తుంది. దీని స్క్రీన్ 7.8 అంగుళాలు. ఇక ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 3,800 ఎంఏహెచ్‌ ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్లు డిసెంబరు నుంచి చైనాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు రాయ్‌లీ సంస్థ తెలిపింది. దీని ధర ఫోన్‌ వేరియంట్‌ను బట్టి రూ.90 వేల నుంచి రూ.1.2 లక్షల మధ్య ఉండనున్నట్లు సమాచారం.

FlexPai phone worlds first foldable screen phone released in China