ఎన్నికలకు, ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికలకు, ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధం లేదు

March 5, 2018

నటుడు బాలకృష్ణ చేతికి సర్జరీ అవటంతో గత నెలలోనే ప్రారంభమవాల్సిన ఎన్టీఆర్ బయోపిక్ వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాపై ఎట్టకేలకు బాలయ్య ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 29న ప్రారంభమవుతుందని వెల్లడించారు. వెలగపూడి అసెంబ్లీ సమావేశాలకు బాలయ్య చేతికున్న కట్టుతోనే హాజరయ్యారు. బాలకృష్ణను చూసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను పరామర్శించారు. కొందరు గాయం ఎప్పుడు మానుతుందని ప్రశ్నించగా, తాను ఎన్నో దెబ్బలు తిన్నానని, ఇదేమీ పెద్ద దెబ్బ కాదని, దీన్ని తాను లెక్క చేయడం లేదని తనదైన శైలిలో బాలయ్య సమాధానం ఇచ్చారు.ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ బయోపిక్ డేట్ ను అనౌన్స్ చేశారు. హైదరాబాద్‌లోని రామకృష్ణ సినీ స్టూడియోలో సినిమా ప్రారంభమవుతుందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా చిత్రాన్ని పూర్తిచేసి  వచ్చే సంక్రాంతి నాటికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ఇదేమీ ఎన్నికల సందర్భంగా తీసే చిత్రం కాదని, ఎన్నికలకు, రాజకీయాలకు, ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధం లేదని వెల్లడించారు. ఈ సినిమాకు చాలా మంది చాలాపేర్లు సూచించారని, ‘ ఎన్టీఆర్ ‘ అన్న పదానికి మించిన పేరు మరొకటి ఉండదన్న ఉద్దేశంతో ఆ పేరునే ఖరారు చేశామని చెప్పారు. ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.