అమ్మాయిలా నడుస్తున్నావని అన్నందుకు..   - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయిలా నడుస్తున్నావని అన్నందుకు..  

February 10, 2018

తమిళనాడులోని తిరుచిరాపల్లి, లాల్‌గుడికి చెందిన పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ళ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు తన నడక, ప్రవర్తన ఆడపిల్లలా వున్నాయని తరచూ ఎగతాళి చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు అంటున్నారు పోలీసులు.

తన మరణానికి ఆ నలుగురే కారణమని సూసైడ్ నోట్ కూడా రాశాడు. స్థానిక పాఠాశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడి ప్రవర్తన అమ్మాయిలా వుందని, అతను గే అని నలుగురు తోటి విద్యార్థులు రోజూ ఎగతాళి చేయడం పనిగా పెట్టుకున్నారట. సదరు విద్యార్థి వారి మీద స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడట. అయినా వారు పట్టనట్టు వ్యవహరించడం వల్లే మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సున్నిత మనస్కుడైన ఆ బాలుడు వారి మాటలతో గాయపడ్డాడు. ప్రతిరోజూ స్కూల్లో ఎదురవుతున్న అవమానాన్ని తట్టుకోవడం అతని వశం కాలేదు. ఆత్మహత్యే శరణ్యమనుకొని ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న బాలుని తల్లి ఫిర్యాదు మేరకు నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశామని స్థానిక  పోలీసు అధికారి ఎస్పీ కళ్యాణ్‌ తెలిపారు. విద్యార్థుల తీరు, ఉపాధ్యాయుల పట్టింపులేనితనంతో తమ కొడుకు అన్యాయంగా ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తల్లదండ్రులు రోధిస్తున్నారు.