పిల్లల ఛానళ్లలో జంక్ ఫుడ్‌పై కొరడా - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లల ఛానళ్లలో జంక్ ఫుడ్‌పై కొరడా

February 8, 2018

పిల్లలు మనం ఏమైనా తినిపిస్తే.. ఊహూ.. వద్దు అని మారాం చేస్తారు.. అదే కార్టూన్ టీవీ ఛానళ్ళు చెబితే మాత్రం బాగా మెక్కేస్తారు..  ఆ ఛానళ్ళలో నూట్రిషనల్ విలువలు లేని లేదా సరిపడ కేలరీలు లేని ఆహారపదార్థాలు జంక్ ఫుడ్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ గురించిన యాడ్స్ పదేపదే ప్రసారమవుతుంటాయి. వీటితో పిల్లలు బాగా ప్రభావితులవుతున్నారు. అవే తింటాం, అవే తాగుతాం అన్నట్టు ఇంట్లో అమ్మానాన్నలతో పేచీ పెట్టుకుంటారు. తప్పదన్నట్టు పిల్లల కోసం తల్లిదండ్రులు వాళ్ళు అడిగినవే కొనిస్తున్నారు.

దీనివల్ల వారి దీర్ఘకాలిక ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం పడుతోందని,  చిన్నపిల్లలను ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్న ఈ జంక్‌ ఫుడ్స్‌ను నిర్మూలించడానికి ప్రభుత్వం, కార్టూన్‌ ఛానల్స్‌లో ప్రసారమవుతున్న వీటి ప్రకటనలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. కాగా సాఫ్ట్‌ డ్రింక్స్‌, జంక్‌ ఫుడ్స్‌  ప్రకటనలను నిషేధించడానికి తగిన అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర సమాచార, టెక్నాలజీ జూనియర్‌ మంత్రి రాజ్యవర్థన్‌ రాథోర్‌ నేడు పార్లమెంట్‌కు తెలిపారు. దీనిపై త్వరలోనే కార్టూన్‌ ఛానల్స్‌కు ఆదేశాలను జారీ చేస్తామన్నారు. 

ఆరోగ్యానికి హాని తలపెట్టే ఇలాంటి ఆహార పదార్థాల ఉత్పత్తులను అరికట్టేందుకు ఈ ఐడియా పనికొస్తుందంటున్నారు. పిల్లల్లో ఊబకాయం, ఇతరాత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తున్న క్రమంలో వీటిపై కొరడా ఝళిపించడం అనివార్యమైందంటున్నారు. ఇలాంటి యాడ్స్‌ ఎక్కువగా నికెలోడియాన్, పోగో ఛానళ్ళలో ప్రసారం అవుతున్నాయి. వీటితో ఛానళ్ళకు రెవెన్యూ కూడా ఎక్కువగానే వుందంటున్నారు. త్వరలోనే వీటి నిర్మూలను ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.