విడాకుల కోసం కోర్టుకోకెక్కిన మాజీ సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

విడాకుల కోసం కోర్టుకోకెక్కిన మాజీ సీఎం

March 2, 2018

పెళ్లై 23 ఏళ్లు అవుతోంది. కొడుకులు కూడా చేతికంది వచ్చారు. వయసు కూడా పెరిగింది. ఈ వయసులో భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. తన భార్య నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కారు. ‘నా  భార్యకు, నాకు అస్సలు పొసగటం లేదు. 2007 నుంచి మా మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2009 నుంచి మేము విడిగానే ఉంటున్నాం. మేం కలిసుండటం కుదరదు. మా బంధం పూర్తిగా దెబ్బతింది. మరో వివాహం చేసుకునేందుకు వీలుగా భార్య పాయల్‌ నుంచి విడాకులు ఇప్పించాలి ’ అని ఒమర్ పిటిషన్‌లో విన్నవించారు. వాదనలు విన్న జస్టిస్‌ సిద్ధార్థ మృదుల్, జస్టిస్‌ దీపా శర్మల ధర్మాసనం.. ఈ విషయమై ఏప్రిల్‌ 23లోగా స్పందనను తెలపాలని పాయల్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలన్న ఒమర్‌ విజ్ఞప్తిపై కూడా పాయల్‌ అభిప్రాయాన్ని హైకోర్టు కోరింది.

ఒమర్ 2016 లో కూడా తనకు పాయల్ నుంచి విడాకులు కావాలని ట్రయల్ కోర్టుకు వెళ్ళారు. తమ వివాహబంధం కోలుకోలేనంతగా దెబ్బతిందని నిరూపించటంలో ఒమర్ విఫలమయ్యారు.  ఆ కారణంగా ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఎలాగైనా తనకు విడాకులు కావాలని ఒమర్ హైకోర్టు మెట్లెక్కారు. ఒమర్, పాయల్‌లకు 1994, సెప్టెంబర్‌ 1న వివాహమైంది.